తెలంగాణలో సోమవారం నుంచి కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్

 


కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ సోమవారం నుంచి తెలంగాణలో మొదలవుతోంది. ప్రధానంగా 60 ఏళ్లు పైబడిన వారితో పాటు 45 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉండి దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న వారికి టీకా ఇవ్వనున్నారు. ప్రైవేట్‌తో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా 102 కేంద్రాల్లో కోవిడ్ టీకా అందించనున్నారు. హైదరాబాద్‌లో 12, ఇతర జిల్లా కేంద్రాల్లో 2 చొప్పున కరోనా వ్యాక్సినేషన్ సెంటర్‌లు ఏర్పాటు చేశారు. కొవిడ్‌ టీకా తీసుకోవాలనుకునే వారు మొబైల్‌ నెంబర్‌ లేదా ఆధార్‌ సంఖ్య ద్వారా cowin.gov.inలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ తరువాత మొబైల్‌కి వచ్చిన లింక్‌ ద్వారా దగ్గర్లో ఉన్న వ్యాక్సిన్‌ కేంద్రంలో కొవిడ్‌ టీకా తీసుకోవచ్చని తెలంగాణ ఆరోగ్యశాఖ తెలిపింది. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఐడీకార్డుతో పాటు వైద్యులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రం తీసుకురావాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో ధ్రువీకరణ పత్రం అప్‌లోడ్‌ చేసినా తర్వాతే వ్యాక్సిన్‌ ఇస్తారు. రాబోయే వారం రోజుల్లో వెయ్యికి పైగా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపడతామని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. అందరూ మొదటి రోజే వ్యాక్సిన్‌ తీసుకునేందుకు తొందరపడవద్దని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి ఒక్కరికీ ఉచిత వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటుందని, వృద్ధుల కోసం వీలైనంత వరకు వీల్‌చైర్‌లు ఏర్పాటు చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కరోనా టీకా వేస్తారు. ఇందుకు ఒక్క డోస్‌కు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ ధర రూ.150 కాగా.. సర్వీస్ చార్జీ రూ.100. ఇంతకంటే ఎవరూ ఎక్కువగా వసూలు చేయకూడదని ఆరోగ్యశాఖ వెల్లడించింది.