బ్రెజిల్, బ్రిటన్, యూరప్ దేశాల్లో కరోనా మహమ్మారి స్వైర విహారం ప్రపంచంలో కరోనా మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే, అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, యూరప్ దేశాల్లో మాత్రం కరోనా మహమ్మారి కొంతమేర విజృంభిస్తూనే ఉన్నది. అమెరికాలో రోజుకు లక్షకు పైగా కేసులు, మూడువేల వరకు మరణాలు నమోదవుతున్నాయి. అయితే, గత రెండు మూడు నెలలుగా బ్రెజిల్ లో కరోనా కేసులు అదుపులోనే ఉన్నాయి. కానీ, గత మూడు రోజుల నుంచి ఒక్కసారిగా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండంతో పాటుగా మరణాల సంఖ్యకూడా పెరుగుతుండటం భయాన్ని కలిగిస్తోంది. బ్రెజిల్ లో రెండు రోజుల క్రిందట 57 వేల కేసులు నమోదుకాగా, మొన్నటి రోజున 51 వేలు, నిన్నటిరోజున 48 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా తగ్గినట్టే తగ్గి మరలా విజృంభిస్తోంది. అటు అమెరికాలోనూ అదే విధంగా కేసులు విజృంభిస్తున్నాయి. రోజువారీ మరణాల సంఖ్య భారీగా నమోదవుతుండటంతో ప్రపంచదేశాలు ఆందోళనలు చెందుతున్నాయి. కరోనా నిబంధనలు పాటించకుంటే తిరిగి విజృంభించే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.