ఈసారి హైదరాబాద్ లో ఐపీఎల్ సందడి...?

 


ఐపీఎల్‌ మ్యాచ్‌ను టీవీల్లో చూసి ఎంజాయ్‌ చేసే వారితో పాటు స్టేడియంలో చేసేవారు కూడా ఉంటారు. సిక్సర్లు, ఫోర్ల మోత మోగుతుంటే స్టేడియంలో సందడి చేస్తూ మ్యాచ్‌ చూడాలనుకునే వారు చాలా మంది ఉంటారు. అయితే ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్‌ మ్యాచ్‌లను హైదరాబాదీలకు స్టేడియంలో చూసే అవకాశం దక్కుతుందా అంటే.. కచ్చితంగా అవునని మాత్రం చెప్పలేని పరిస్థితి ఉంది. ఇటీవలే చెన్నై వేదికగా ఐపీఎల్‌ మినీ వేలంపాట జరిగిన విషయం తెలిసిందే. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్‌ 2021 ప్రారంభంకానుంది. అయితే గతేడాది కరోనా విజృంభన ఓ రేంజ్‌లో ఉన్న కారణంగా ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్‌ పూర్తి అయింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది కేసులు తగ్గడం, వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంతో స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈసారి కేవలం ఆరు వేదికలనే కేటాయించనున్నారు. ప్రస్తుతానికి చెన్నై, బెంగళూరు, దిల్లీలను, కోల్‌కతా, అహ్మదాబాద్‌లను మాత్రమే వేదికలుగా ఎంపిక చేశారని సమాచారం. ఒకవేళ మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే.. ఇంకో వేదికగా ముంబై చేరనుంది. దీంతో ఈ సారి హైదారాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ జరగట్లేదని తెలుస్తోంది. మరి హైదారాబాద్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగుతాయో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా పేరుగాంచిన మొతేరాలో జరుగుతుండడంతో సర్వత్రా ఆసక్తినెలకొంది