ఉచిత నీటి సరఫరా పథకం అమలుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. నేటి నుంచి క్యాన్ నెంబర్ ఆధారంగా మీ సేవా కేంద్రాల్లో డొమెస్టిక్ వినియోగదారులు ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు వెసులుబాటు కల్పించామని జలమండలి ఎండీ దానకిశోర్ తెలిపారు. శనివారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో అధికారులతో ఎండీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి పక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
తొలుత డొమెస్టిక్/స్లమ్ వినియోదారులకు...
తొలుత డొమెస్టిక్, స్లమ్ వినియోగదారులు క్యాన్ నెంబర్ల ఆధారంగా మీ సేవా కేంద్రాల్లో ఆధార్ నెంబర్‌ను అనుసంధానం చేసుకోవాలని ఎండీ దానకిశోర్ సూచించారు. ప్రజలు సులభంగా పొందేందుకు ఈ సేవలను సులభతరం చేశామని తెలిపారు. నల్లా కనెక్షన్ కలిగి ఉన్న యజమాని స్వయంగా ఆధార్‌తో పాటు ఆరు నెలల్లో జలమండలి జారీ చేసిన ఏదైనా ఒక బిల్లు కాపీని మీ సేవా కేంద్రానికి తీసుకెళ్తే అనుసంధాన ప్రక్రియ సులభంగా పూర్తి చేస్తారని చెప్పారు. మీటర్ రీడర్లు వినియోగదారుల ఇంటింటికి వెళ్లి ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మీటర్లు వినియోగంలో లేని వారు, మీటర్లు ఉన్నా.. పని చేయని ఇంటి యజమానులు నూతనంగా మీటర్లను తీసుకోవాల్సి ఉంటుందని ఎండీ దానకిశోర్ స్పష్టం చేశారు. మీటర్లు ఏర్పాటు చేసుకున్న తేదీ నుంచి 20వేల లీటర్ల నీటిని పొందేందుకు అర్హులవుతారని తెలిపారు.
త్వరలోనే బల్క్/ఎంఎస్బీలకు..
త్వరలోనే బల్క్, ఎంఎస్బీ (మల్టీ స్టోర్డ్ బిల్డింగ్) వినియోగదారులకు సంబంధించిన ఆధార్ అనుసంధానంపై స్పష్టత ఇస్తామన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం డొమెస్టిక్, స్లమ్, బహుళ అంతస్తుల భవనం/బల్క్ కనెక్షన్ల వినియోగదారులు క్యాన్‌నెంబర్ల ఆధారంగా ఆధార్ ను అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.