కనీస వివరాలు లేకుండా ప్రభుత్వ చర్యలను తప్పుపడుతూ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు మూసివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అమ్మఒడి పథకానికి రూ.24.24 కోట్ల నిధుల విడుదలకు ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్‌కు పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ న్యాయవాది చింతా ఉమామహేశ్వరరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. గత వారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, ప్రాథమిక సమాచారం లేకుండా పిల్ దాఖలు చేయడమే కాక, వివరాలు కోరితే సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశామని ఎలా చెబుతారని ధర్మాసనం ప్రశ్నించింది. తగిన సమాచారం లేకుండా ఇలాంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాల పేరుతో కోర్టు సమయాన్ని వృథా చేయడం తగదని పిటిషనర్‌పై అసహనం వ్యక్తం చేసింది. బుధవారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, సీజే ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి సమాచారంతో తిరిగి పిల్ దాఖలు చేసుకోవచ్చంది.