తెలంగాణలో పార్టీ స్థాపన ప్రయత్నాల్లో ఉన్న వైఎస్ షర్మిల నేడు లోటస్ పాండ్‌లో విద్యార్థులతో సమావేశం కానున్నారు. దాదాపు 350 మంది విద్యార్థులు పాల్గొననున్న ఈ సమావేశంలో విద్యార్థుల సమస్యలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు తీరు తదితర అంశాలపై చర్చించనున్నారు. వారి నుంచి అభిప్రాయాలను సేకరిస్తారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నేతలతో ఇటీవల వరుసగా భేటీ అవుతున్న షర్మిలను నిన్న ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, ఆదిలాబాద్ నుంచి వచ్చిన పలువురు అభిమానులు లోటస్‌పాండ్‌లో కలిశారు. ఆమెను కలిసిన వారిలో జనగామ మునిసిపాలిటీ మాజీ చైర్మన్ సుధాకర్, మాజీ ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి తదితరులు కూడా ఉన్నారు.