ఆర్మీ అధికారుల పేరిట దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. ఓఎల్ఎక్స్లో క్రయవిక్రయాలకు సంబంధించిన ప్రకటనలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్న నేరగాళ్ల అడ్డా దొరకటంతో సంబంధిత సంస్థ ఆ ప్రాంతాల నుంచి వచ్చే ప్రకటనలను గుర్తించి తిరస్కరిస్తున్నది. దీంతో ప్రజలను మోసం చేసేందుకు ఐపీలు మారుస్తూ నయా పంథాను ఎంచుకున్నారు.
రాజస్థాన్‌లోని భరత్పూర్, అల్వార్ జిల్లాలు సైబర్ నేరగాళ్లకు అడ్డాగా మారాయి. ఆర్మీ అధికారులమంటూ ఓఎల్ఎక్స్లో పలు రకాల ప్రకటనలు ఇచ్చి దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్నారు. ఈ రెండు జిల్లాల్లో వేల సంఖ్యల్లో ఉన్న సైబర్ నేరగాళ్లు అమాయకులే లక్ష్యంగా లక్షల రూపాయలు దోచేస్తున్నారు. వీరి వలలో పడి మోసపోయిన వారు మన రాష్ట్రంలోనూ చాలా మంది ఉన్నారు. దీంతో హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు ఓఎల్ఎక్స్ సంస్థ ప్రతినిధులకు నోటీసులు జారీ చేయడంతో ఆ రెండు జిల్లాల నుంచి ఇంటర్నెట్లోకి అప్లోడ్ అయ్యే ప్రకటనలను ఐపీ అడ్రస్ ఆధారంగా తిరస్కరిస్తున్నది. అదే విధంగా భరత్పూర్ జిల్లాలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి ఓఎల్ఎక్స్, నకిలీ ఫేస్బుక్ ఖాతాలు, క్యూఆర్ కోడ్ తదితర సైబర్ మోసాలకు పాల్పడే నేరగాళ్లను హైదారాబాద్‌తోపాటు ఇతర జిల్లాలు, రాష్ర్టాల పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో నెల రోజుల క్రితం వరకు తగ్గుముఖం పట్టినట్లుగా అన్పించిన భరత్పూర్, అల్వార్ జిల్లాలకు సంబంధించిన నేరాలు ప్రస్తుతం కొత్త పుంతలు తొక్కాయి.