దేశంలో గ్యాస్‌ ధరలు భగ్గుమంటోన్నాయి
 దేశంలో గ్యాస్‌ ధరలు భగ్గుమంటోన్నాయి. అవి ఇకపై పెట్రోల్‌ ధరల్లా పెరుగుతూ.. సామాన్యుడి నెత్తిన భారం కానున్నాయి. ఈ కార్యాచరణకు కేంద్రం పూనుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌ ధరల ఆధారంగా దేశంలో కూడా గ్యాస్‌ ధరలో మార్పులు, చేర్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.  త్వరలో రోజువారీ గ్యాస్‌ రేటు..! గతేడాది డిసెంబరులో రెండు దఫాలుగా వంట గ్యాస్‌ ధరలను కేంద్రం పెంచింది. గఅహావసరాలకు వినియోగించే సిలిండరు ధర రూ.100 వరకు పెరిగింది. వాణిజ్య సిలిండర్ల ధరలు కూడా పెరిగాయి. దైనందిన జీవితంలో వంట తప్పనిసరి. కాబట్టి ప్రజల నుంచి పెద్దగా నిరసనలు రాకపోవటంతో గ్యాస్‌ విషయంలో కూడా సాధ్యమైనంత త్వరితంగా రోజువారీ గ్యాస్‌ రేటు విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. ఏప్రిల్‌ నుంచి జులైలోగా ఇది కార్యరూపంలోకి వచ్చే అవకాశముందని సమాచారం. దాదాపు నాలుగున్నరేళ్ల నుంచి అంతర్జాతీయ ధరల ఆధారంగా పెట్రోలు, డీజిల్‌ ధరలలో రోజువారీ మార్పులస్తున్నాయి. ఇక పై గ్యాస్‌ ధరలు కూడా ఇలాగే అంతర్జాతీయంగా రోజువారీ మారతాయట ! తొలిదశలో ప్రతి 15 రోజులకు ఒకసారి మార్చటమా? లేక వారానికి ఒకసారి మార్చాలా? అనే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది.  నష్టాన్ని ఇలా పూడ్చుకుంటారట..! గ్యాస్‌ ధరలను ఇలా రోజువారీ విధానంలో పెంచి గ్యాస్‌ పై నష్టాన్ని పూడ్చుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికే కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రస్తుతం ప్రతి నెలా మొదటివారంలో అంతర్జాతీయ ధరల ఆధారంగా వంట గ్యాస్‌ ధరలను పెంచుతోంది. ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి, ఆ తర్వాత వారానికి ఒకసారి రేట్లను మార్చటం ద్వారా గ్యాస్‌పై నష్టాన్ని పూడ్చుకోవాలన్నది ప్రభుత్వ యోచన అని పెట్రోలియం మంత్రిత్వ శాఖవర్గాల ద్వారా స్పష్టం చేసింది. ఇది ఎప్పటి నుంచి అమలు చేయాలన్నది ఇంకా ఖరారు కాలేదని ఓ అధికారి చెప్పారు. పెట్రోలు, డీజిల్‌ ధరల విషయంలో ప్రభుత్వం ఇదే విధానాన్ని అమలు చేసిందని అన్నారు. మొదట 15 రోజులకు ఒకసారి పెంచింది. తర్వాత దాన్ని వారానికి కుదించింది. ఆపై రోజువారీగా పెట్రోలు ధరలు మారుతున్నాయి. ఈ తరహాలోనే వంట గ్యాస్‌ ధరలను అంతర్జాతీయ మార్కెట్‌ ఆధారంగా మార్చాల్సి వస్తుందని గతంలోనే పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకటించినట్లు ఆ అధికారి గుర్తు చేశారు.