గత రెండు రోజులనుంచి చల్లటి గాలులు

 
గత రెండు రోజులనుంచి చల్లటి గాలులు వీస్తుండగా...గురువారం రాత్రి ఒక్కసారిగా వర్షం కురిసింది. సుమారు గంటకు పైగా వాన కురవటంతో..లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారుపై మురుగునీరు పొంగిపొర్లింది. పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షం పడటంతో హైదరాబాద్‌లో ప్రధాన రహదారుల్లో వాహనాల రోకలకు తీవ్ర అసౌకర్యం కలిగింది.నాంపల్లి,జియాగూడ,ఖైరతాబాద్‌,షేక్‌ పేట ఇలా పలు ప్రాంతాల్లోని కాలనీల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కాగా వచ్చే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ మరియు దాని పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు దక్షిణ మధ్య మహారాష్ట్ర మరియు దాని పరిసర ప్రాంతాలలో కొనసాగుతూ 0.9 కి. మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంది. క్రింద స్థాయి తూర్పు గాలులలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ఈరోజు ఉత్తర కేరళ తీరం నుంచి అంతర్గత కర్నాటక నుంచి మీదుగా దక్షిణ మధ్య మహారాష్ట్ర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వరకు 0.9 కి. మీ. ఎత్తు వరకు ఉంది. దీని ఫలితంగా రాష్ట్రంలో ఈరోజు కొన్ని ప్రాంతాలలో, రేపు ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌ మరియు కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మరియు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.