ఆంధ్రప్రదేశ్‌ (తిరుపతి)లో తొలి టెక్నాలజీ కేంద్రాన్ని (హబ్‌) ప్రారంభించిన అమరరాజా బ్యాటరీస్
లిథియం అయాన్‌ బ్యాటరీల అభివృద్ధికి దేశంలోనే తొలి టెక్నాలజీ కేంద్రాన్ని (హబ్‌) అమరరాజా బ్యాటరీస్‌, ఆంధ్రప్రదేశ్‌ (తిరుపతి)లోని తమ తయారీ కేంద్రంలో ప్రారంభించింది. ఇందుకు రూ.20 కోట్ల పెట్టుబడి పెట్టింది. ప్రయోగాత్మక ప్రాజెక్ట్‌గా ప్రారంభించిన ఈ కేంద్రం, వచ్చే కొన్నేళ్లలో ప్రైవేట్‌ రంగంలో తొలి లిథియం అయాన్‌ బ్యాటరీల తయారీ కేంద్రంగా మారుతుందని అమర రాజా బ్యాటరీస్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) ఎస్‌.విజయానంద్‌ తెలిపారు. లిథియం అయాన్‌ బ్యాటరీ టెక్నాలజీ కోసం అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. 2019లో ఇస్రో నుంచి ఈ టెక్నాలజీ లైసెన్సు పొందిన 10 కంపెనీలు బిడ్డింగ్‌, టెక్నాలజీ బదిలీ ఫీజులు చెల్లించాల్సి ఉండగా, అమరరాజా ఇప్పటికే చెల్లించిందని వెల్లడించారు. మరికొన్ని దశాబ్దాల పాటు లెడ్‌ యాసిడ్‌ బ్యాటరీల వృద్ధి ఉంటుందని, విద్యుత్‌ వాహనాల్లో లిథియం బ్యాటరీల వాణిజ్య వినియోగం పెరగడానికి సమయం పడుతుందన్నారు. 2025 నాటికి దేశంలో విద్యుత్‌ ద్విచక్ర, త్రిచక్ర వాహన వినియోగం 20-25 శాతానికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం కింద లిథియం అయాన్‌ బ్యాటరీల స్థానిక తయారీకి రూ.18000 కోట్ల ప్రభుత్వ సబ్సిడీలు లభిస్తాయని విజయానంద్‌ తెలిపారు.