పేదలకు భారంగా వ్యాధి నిర్ధారణ పరీక్షల్ని ఉచితం

 


పేదలకు భారంగా వ్యాధి నిర్ధారణ పరీక్షల్ని ఉచితంగా నిర్వహించేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. 57 రకాల సాధారణ రక్త, మల, మూత్ర సమగ్ర పరీక్షలను, ఆధునిక పరీక్షలను ఉచితంగా అందుబాటులోకి తెస్తోంది. మూడేళ్ల కిందట జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రారంభించిన టి-డయాగ్నోస్టిక్స్‌ను పల్లెలకూ విస్తరించాలని నిర్ణయించింది. సిద్దిపేటలో ఇటీవలే ప్రారంభించగా.. నెలలో మరో 19 జిల్లాల్లో ప్రారంభించేందుకు వైద్యఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. నాణ్యతా, ప్రమాణాల విషయంలోనూ రాజీ పడకుండా.. తమిళనాడుకు చెందిన సీఎంసీ వెల్లూర్‌, ఎయిమ్స్‌ ఢిల్లీ ఆసుపత్రులతో ఆరోగ్యశాఖ ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ రెండు ఆసుపత్రుల నిపుణులు ఎప్పటికప్పుడు ఇక్కడి ప్రయోగశాలల్లో నిర్ధారణ పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించి, అవసరమైన సలహాలు, సూచనలు అందజేస్తుంటారు. 2018 జనవరిలో తొలిసారిగా నారాయణగూడలోని ఐపీఎంలో 'తెలంగాణ డయాగ్నోస్టిక్స్' పేరిట నూతన పథకాన్ని అమల్లోకి తెచ్చారు. దీని పరిధిలోకి 2 జిల్లా ఆసుపత్రులు, 5 ప్రాంతీయ ఆసుపత్రులు, 9 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 104 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 200 బస్తీ దవాఖానాలను అనుసంధానం చేశారు. ఇప్పుడు ఈ సేవలను 'టి-డయాగ్నొస్టిక్స్‌' అనే బ్రాండ్‌ పేరిట రాష్ట్రమంతటా విస్తరించాలని... ఈసీజీ, ఎక్స్‌రే, ఇతర ఫలితాలను టెలీ రేడియాలజీ విధానానికి అనుసంధానం చేయాలని నిర్ణయించింది. అన్ని జిల్లాల్లోని ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రులు ఈ ప్రయోగశాలలకు అనుసంధానమవుతాయి. నిత్యం వీటిలో సేకరించిన నమూనాలను జిల్లా కేంద్రంలోని ప్రయోగశాలకు చేర్చుతారు. నమూనాలు సేకరించేటప్పుడే ఆన్‌లైన్‌లో పొందుపరచిన సమాచారం ప్రయోగశాలకు చేరుతుంది. పరీక్షల నమూనాలను పరికరాల్లో పొందుపరచినప్పుడే.. రోగి సమాచారం కూడా పరికరానికి చేరిపోతుంది. దీంతో పరికరమే ఆన్‌లైన్‌లో నేరుగా రోగి ఫోన్‌ నంబరుకు ఫలితాల సమాచారాన్ని పంపిస్తుంది. అదే సమాచారం సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, ఇతర ఆసుపత్రులకు పంపిస్తుంది. అవసరమైతే రోగులు ఆ కేంద్రానికి వెళ్లి కూడా సమాచారం పొందవచ్చు.

ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల, జనగామ, జగిత్యాల, కరీంనగర్‌, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, నల్గొండ, నాగర్‌కర్నూల్‌, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, సంగారెడ్డి, వికారాబాద్‌ ఆసుపత్రుల్లో వచ్చే నెలలో ప్రారంభించనున్నారు. కరీంనగర్‌, ఖమ్మం, జోగులాంబ గద్వాల, ములుగు జిల్లాల్లో ఇప్పటికే నెల రోజులుగా ప్రయోగాత్మక సేవలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి మిగిలిన జిల్లాల్లోనూ వీటిని నెలకొల్పుతామని వైద్యవర్గాలు తెలిపాయి.