పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కీసరి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌

 
పేద ప్రజలపై పెనుభారం మోపుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కీసరి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మన్సూరాబాద్‌లోని ఎల్‌పీటీ వద్ద గురువారం ఆటో యూనియన్‌ కార్మికులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ధరలను పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజల ఆర్థిక పరిస్థితిపై భారం మోపుతుందన్నారు. కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసి పేద ప్రజలను ఆదుకోవాల్సిన తరుణంలో ప్రజలపై భారం మోపుతూ కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తుందన్నారు. అచ్చే దిన్‌ అంటూ సామాన్యులు సచ్చే రోజులు దాపురించాయని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల హామీ విస్మరించారని, పెన్షన్లు రేషన్‌ కార్డుల ఊసే లేదని ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు. పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలను తగ్గించి జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేస్తూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల తరఫున సీపీఐ(ఎం) పార్టీ పోరాటాలు చేస్తుందని, ఎవరి బెదిరింపులు, తాటాకు చప్పుళ్లకు పార్టీ భయపడదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఎం వీరయ్య, భీమనపల్లి, కనకయ్య, సీహెచ్‌ వెంకన్న, యాదాద్రి క్యాబ్‌ డ్రైవర్‌ యూనియన్‌ నాయకులు ఆర్‌ రమణ, శ్రీశైలం, గిరి, దానయ్య, నాగిరెడ్డి, బాబ్జి , వెంకట్‌, యాదగిరి పాల్గొన్నారు.