టెలికం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియోకు ఎయిర్టెల్ భారీ షాకిచ్చింది. గడిచిన డిసెంబరు నెలలో ఏకంగా 4.05 మిలియన్ల మంది వైర్లెస్ సబ్స్క్రైబర్లను చేర్చుకుంది. ఫలితంగా మంత్లీ సబ్స్రైబర్ల విషయంలో అగ్రస్థానాన్ని నిలుపుకుంది. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ ప్రకారం.. గతేడాది డిసెంబరులో రిలయన్స్ జియోకు 4,79,000 మంది వైర్లెస్ ఖాతాదారులు మాత్రమే తోడయ్యారు. విజిటర్ లొకేషన్ రిజిస్టర్ (వీఎల్ఆర్)లోనూ జియోను ఎయిర్టెల్ బీట్ చేసింది. యాక్టివ్ సబ్స్క్రైబర్లకు ఇది చక్కని కొలమానం.
తాజాగా వచ్చి చేరిన 4.05 మిలియన్ల మందితో కలుపుకుని గతేడాది డిసెంబరు 31 నాటికి ఎయిర్టెల్ వైర్లెస్ సబ్స్క్రైబర్ల మొత్తం సంఖ్య 338.7 మిలియన్లకు చేరుకుంది. ఎయిర్టెల్ మార్కెట్ షేర్ 29.36గా ఉంది. అంతకుముందు నెల అది 28.97 గా ఉంది. ఇక, జియోకు డిసెంబరు నెలలో 478,917 మంది ఖాతాదారులు మాత్రమే వచ్చి చేరారు. దీని మార్కెట్ షేర్ 35.43 శాతంగా ఉంది. అంతకుముందు నెల (35.34 శాతం)తో పోలిస్తే స్వల్ప పెరుగుదల కనిపించింది. అదే సమయంలో బీఎఎస్ఎన్ఎల్ 252,501 మంది ఖాతాదారులను కోల్పోగా, వొడాఫోన్ ఐడియా (వీఐ) 5.69 మిలియన్ల మందిని కోల్పోయింది.