ప్రైవేటీకరణపై ప్రధాని మోడీ క్లారిటీ

 


ప్రైవేటీకరణపై ప్రధాని మోడీ క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. వారసత్వంగా వస్తున్నాయని చెప్పి.. నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను నడపలేమని తేల్చిచెప్పారు. నాలుగు వ్యూహాత్మక రంగాలు మినహా అన్ని ప్రభుత్వం సంస్థను ప్రైవేటీకరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వ్యాపారం అనేది అసలు ప్రభుత్వ వ్యవహారమే కాదని తెగేసి చెప్పారు. నష్టాల్లో ఉన్న సంస్థలు ప్రజాధనంతో నడుస్తున్నాయని.. అలాంటి వాటిని ప్రైవేటీకరించడమే ఉత్తమమన్నారు.


నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను నడపలేమని.. అలాంటి సంస్థల ఆర్థిక పరిపుష్టికి ఆర్థిక సాయం అందించడం వలన ప్రభుత్వంపై భారం పడుతోందని చెప్పారు. ప్రభుత్వమే స్వయంగా వ్యాపారం చేయాల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో లేదని చెప్పారు. సంపద సృష్టి, ఆధునికీకరణ నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని మోదీ స్పష్టం చేశారు.


ప్రభుత్వరంగ సంస్థలను స్థాపించినప్పటి పరిస్థితులు వేరని.. నష్టాల్లో ఉన్న సంస్థలు ఇప్పుడు భారంగా మారాయన్నారు. 50-60 ఏళ్లనాటి విధానాల్లో సంస్కరణలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాధనాన్ని నష్టాల్లో ఉన్న సంస్థలకు ఖర్చు చేయకుండా.. సద్వినియోగం చేయడమే లక్ష్యంగా సంస్కరణలు తీసుకొస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం వైదొలిగే రంగాలను ప్రైవేటు రంగం భర్తీ చేస్తుందనన్నారాయన. దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు అవసరమైన బాటలను బడ్జెట్‌ వేసిందని ఆయన తెలిపారు.


లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా పెట్టబడులను ఉపసంహరించుకుంటామని కేంద్రం ఇది వరకే ప్రకటించింది. ఎల్‌ఐసీతో పాటు రాబోయే రోజుల్లో ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పవన్ హన్స్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్, నీలాచల్ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తామని బడ్జెట్‌ సందర్భంగా వెల్లడించింది.