పాకిస్థాన్ దేశంలోని కరాచీ పారిశ్రామికవాడలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం

 పాకిస్థాన్ దేశంలోని కరాచీ పారిశ్రామికవాడలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. కరాచీ నగరంలోని బాల్దియా పారిశ్రామికవాడలో జరిగిన అగ్నిప్రమాదంలో యజమానుల నిర్లక్ష్యం వల్లనే ముగ్గురు మరణించారని కరాచీ మెట్రోపాలిటన్ కార్పొరేషన్, పోలీసు, అగ్నిమాపకశాఖల అధికారులు ఆరోపించారు. పాక్ పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం జరిగిన తర్వాత సకాలంలో సహాయక చర్యలు చేపట్టక పోవడంతో ముగ్గురు మరణించారు. అల్ మక్కా ఫ్యాబ్రిక్స్ అనే ఫ్యాక్టరీలో జైలు లాగా పెద్ద గోడలు నిర్మించారని, దీనివల్ల అగ్నిప్రమాదం జరిగినపుడు సహాయచర్యలు చేపట్టలేక పోయారని అంటున్నారు.


కాగా అగ్నిమాపకశాఖ అధికారులు సకాలంలో వచ్చిఉంటే ప్రాణనష్టం జరిగేది కాదని ఫ్యాక్టరీ యజమాని ఇమ్రాన్ అంటున్నారు. ఫ్యాక్టరీ భవనంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేదని అగ్నిమాపకశాఖ అధికారులు ఆరోపించారు. 600 గజాల్లో నిర్మించిన మూడు అంతస్తుల భవనాన్ని జైలులా నిర్మించారని, దీనివల్ల అగ్నిప్రమాదం జరిగినపుడు లోపలున్న వారిని కాపాడలేక పోయామని అగ్నిమాపకశాఖ అధికారులంటున్నారు. అలీ షేర్ హైదరీ, ముహమ్మద్ కాజిం, ఫయాజ్ లు అగ్నిప్రమాదంలో మరణించారు.