బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ నివేదిక ప్రకారం దేశాన్ని నాలుగు భూకంప ప్రభావిత ప్రాంతాలు

 


బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ నివేదిక ప్రకారం దేశాన్ని నాలుగు భూకంప ప్రభావిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. అత్యంత తీవ్రత గల భూకంపాలు సంభవించే ప్రాంతాలను జోన్‌-4లో చేర్చారు. అక్కడ తీవ్రత గరిష్ఠంగా రిక్టర్‌ స్కేల్‌పై 7.9 రీడింగ్‌ వరకు నమోదయ్యే అవకాశముంటుంది. ఎక్కువ తీవ్రతతో వచే ్చ ప్రాంతాలను జోన్‌-3లో.. ఇక్కడ రిక్టార్‌ స్కేల్‌పై 6 నుంచి 7 తీవ్రత నమోదవుతుంటుంది. 4-6 తీవ్రతతో గలవి మధ్యస్థాయి భూకంప ప్రాంతాలుగా పరిగణించి జోన్‌-2లో చేర్చారు. స్వల్పంగా ప్రకంపనలు సంభవించే ఏరియాలను జోన్‌-1గా పేర్కొన్నారు. ఈ ఒకటో జోన్‌లోనే మన హైదరాబాద్‌ ఉన్నది. సునామీలు వంటి వాటికి చోటు లేకపోవడం, భారీ వరదలు కూడా నమోదయ్యే అవకాశాలు తక్కువగా ఉండటం వల్ల ఈ మహానగరం అత్యంత సురక్షితమైనదిగా పేర్కొంటారు. అయితే భాగ్యనగరాన్ని కూడా అప్పుడప్పుడు స్వల్ప ప్రకంపనలు చుట్టుముడుతున్నాయి. అందుకు మానవ తప్పిదాలే కారణమని అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి.


నాలుగు శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ ఒకప్పుడు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కొండలు, గుట్టలు, లోయలు, వాగులు, నదులతో కళకళలాడేది. నగరం విస్తరణతో అవన్నీ కనుమరుగయ్యాయి. క్రమరహితమైన అభివృద్ధితో పాటు నీరు, భూమి వంటి ప్రకృతి వనరుల విచ్చలవిడి వినియోగం పెరిగింది. దీంతో ఎత్తయిన ప్రాంతాలు పల్లపు ప్రాంతాలుగా మారి భూమి తన సమతాస్థితిని కోల్పోయింది. ఫలితంగా భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయని నిపుణులు వివరిస్తున్నారు. ముఖ్యంగా నలభై ఏండ్లలో నగరీకరణ విపరీతంగా జరుగడంతో జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 18,480 మందికి పెరిగిందని, దీంతో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడంతో భూమిపై భారం ఎక్కువై భూ సమతాస్థితి దెబ్బతింటున్నదని వివరిస్తున్నారు. అదేవిధంగా ఐటీ, పరిశ్రమలు, రెసిడెన్షియల్‌, కమర్షియల్‌ భవన సముదాయాల నిర్మాణంలో ఎత్తయిన ప్రాంతాల నుంచి టన్నుల కొద్దీ మట్టిని తొలగించి చదును చేస్తున్నారు. 50-70 అడుగుల లోతు తవ్వి సెల్లార్లను నిర్మిస్తున్నారు. దీంతో ఉపరితలంపై సహజసిద్ధంగా కొన్ని వందల ఏండ్లలో జరుగాల్సిన మార్పులు కేవలం రోజుల వ్యవధిలోనే చోటుచేసుకుంటున్నాయని, ఫలితంగా భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


దేశ రాజధాని ఢిల్లీతో సహా ఉత్తర భారత్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భూ ప్రకంపనలు సంభవించాయి. అయితే అత్యంత సేఫ్‌ జోన్‌లో ఉన్న హైదరాబాద్‌లోనూ గతంలో ఇలాంటి కంపనాలు వచ్చాయి. బోరబండ, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో స్వల్ప స్థాయిలో అప్పట్లో భూమి కంపించింది. వేగంగా జరుగుతున్న పట్టణీకరణతో పల్లపు ప్రాంతాలు సహజత్వాన్ని కోల్పోవడం, విచ్చలవిడిగా బోర్లు వేయడం వల్ల భూమి పొరల్లో వరదనీరు చేరి..భూపటలాల మధ్య చీలికలు ఏర్పడి స్వల్ప ప్రకంపనలకు కారణమవుతున్నాయని నిపుణులు విశ్లేషించారు. ఇవి ప్రమాదకరం కాకున్నా... తక్షణం మేల్కొని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.