రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో నిఘా

 


మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నందున ఆయా రాష్ట్రాలతోగల సరిహద్దు జిల్లాల్లో నిఘా పెంచామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో అప్రమతంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారన్నారు. రాష్ట్రంలో వైరస్‌ కట్టడికి మరిన్ని పరీక్షలు, ట్రేసింగ్‌ ఏర్పాట్లు చేశామన్నారు. హోం ఐసోలేషన్‌ కిట్లు అందిస్తామన్నారు. గాంధీ ఆస్పత్రితోపాటు టిమ్స్, నిమ్స్‌లలోనూ మళ్లీ పటిష్ట ఏర్పాట్లు చేస్తామన్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతానికి కేసులు భారీగా పెరిగిన దాఖలాలు లేనందున ప్రస్తుతానికి కర్ఫ్యూపై ఎలాంటి ఆలోచన లేదన్నారు. అయినప్పటికీ కరోనా ఉన్నంతకాలం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఈటల సూచించారు.