కళలను, సాహిత్యాన్ని, కళా కారులను ప్రోత్సహిస్తున్న గొప్ప కళా క్షేత్రం త్యాగరాయగానసభ సంస్థ

 


కళలను, సాహిత్యాన్ని, కళా కారులను ప్రోత్సహిస్తున్న గొప్ప కళా క్షేత్రం త్యాగరాయగానసభ సంస్థ అని మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ జి.చంద్రయ్య అన్నారు. చిక్కడపల్లిలోని త్యాగరాయగాన సభకు ఐఎస్‌ఓ గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో ఐఎస్‌ఓ గుర్తింపు ధ్రువీకరణ పత్రం ప్రదానోత్సవ కార్యక్రమం గాన సభ అధ్యక్షుడు జనార్దనమూర్తి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్యం నిలువాలంటే ప్రజల్లో నుంచి కళాకారులు రావాల్సిన అవసరం ఉందన్నారు. కళాకారులు వృద్ధిలోకి రావాలంటే ఈ కళలు వారి తల్లిదండ్రుల నుంచి ప్రారంభం కావాలన్నారు.

తెలుగు కళాకారులు ప్రత్యేకంగా అభివృద్ధి చెందడానికి కృషిచేస్తున్న త్యాగరాయగానసభ అంతర్జాతీయ స్థాయికి చేరుకుందన్నారు. తెలంగాణ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అయాచితం శ్రీధర్‌ మాట్లాడుతూ సాహి త్యం, సాంస్కృతిని ప్రతిబింభించే సంస్థ గానసభ అని తెలిపారు. టీఎస్‌వీసీఎల్‌ మాజీ చైర్మన్‌ జి.దేవిప్రసాద్‌ మాట్లాడుతూ 54 ఏండ్లుగా త్యాగరాయగానసభ కళలకు పుట్టినిల్లుగా నిలుస్తూ వస్తుందన్నారు. ఈ సమావేశంలో హెచ్‌వైఎం ఇంటర్నేషనల్‌ సర్టిఫికేషన్స్‌ ప్రతినిధి ఆలపాటి శివయ్య, సినీనటి రాగిని, శివపార్వతి, గాన సభ కమిటీ సభ్యురాలు గుండవరపు గీతాదేవి తదితరులు పాల్గొన్నారు.