కరోనా మహమ్మారి విదేశీ ప్రయాణాలకు తాత్కాలిక బ్రేకులు వేయగలిగింది.. కానీ భారత్‌ను పూర్తిగా విదేశాలకు తరలి పోవాలనుకునే వారిని ఆపలేకపోయింది. మరీ ముఖ్యంగా దేశంలో ధనవంతులు భారత్‌ను విడిచి ఇతర దేశాల పౌరసత్వం తీసుకోవడం, అక్కడే
స్థిరనివాసాలు ఏర్పర్చు కోవడం, శాశ్వతంగా ఆ దేశ పౌరులుగానే మారిపోవడానికి అన్ని ప్రయత్నాలు చేశారని తాజాగా ఓ ఏజెన్సీ తన నివేదికలో వెల్లడించింది. ''మీ దేశాల్లో పెట్టుబడులు పెడతాం.. మాకు నివాస సౌకర్యం కల్పిస్తారా'' అని వాకబు చేసే ధనవంతుల సంఖ్య మరింతగా పెరిగిందని లండన్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ప్రపంచ పౌరసత్వ, నివాస సలహా సంస్థ ''హెన్లే అండ్ పార్ట్నర్స్'' నివేదిక వెల్లడించింది. అలాగే, 'సిటిజన్ షిప్ బై ఇన్వెస్ట్ మెంట్స్ ప్రోగ్రామ్స్' అనే కార్యక్రమంపై కూడా వీరు వాకబు చేసినట్టు ముంబయి ఏజెన్సీ తెలిపింది. అయితే, భారత చట్టాలు ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించవు కాబట్టి వీరు భారత పౌరసత్వాన్ని వుదులుకోవడానికి మొగ్గుచూపుతున్నారని తెలిసింది. విదేశాలకు తరలిపోవాలనుకునే ధనవంతులలో చాలామంది ''సిటిజన్‌షిప్ బై ఇన్వెస్టిమెంట్స్'' ను ఎంచుకున్నారని పేర్కొంది. అలాగే, 2019తో పోలిస్తే 2020లో ఇలాంటి వారి సంఖ్య 63 శాతం పెరిగినట్టు ఈ ఏజన్సీ పేర్కొంది.
దీనిపై గ్లోబల్ సౌత్ ఏసియా టీమ్ హెన్లే, పార్ట్ నర్స్ హెడ్ నిర్భరు హందా మాట్లాడుతూ..''పెట్టుబడులు పెడతాం.. మాకు నివాస సౌకర్యం కల్పించండి అంటూ యూఎస్, కెనడా, పోర్చుగల్, ఆస్ట్రియా, మాల్టా, టర్కీ వంటి దేశాలకు వెళ్లాలనుకునే వారు అధికంగా వాకబు చేశారని'' తెలిపారు. 2019లో ఇండియా నుంచి సుమారు 1500 ఎంక్వయిరీలు వచ్చాయని చెప్పారు. అలాగే, 2019లో సుమారు 7,000 మంది భారతీయు సంపన్నులు భారత్‌ను విడిచి విదేశాలకు వెళ్లిపోయారని 'గ్లోబల్ హెల్త్ మైగ్రేషన్ రివ్యూ పేర్కొంది. విదేశాలకు తరలిపోవాలనుకునే సంపన్నులలో భారత్ రెండో అతి పెద్ద బృందంగా ఉందని తెలిపింది. అలాగే, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, నైజీరియా దేశాలకు చెందిన ధనికులు సైతం ఇదే దారిలో ముందుకు సాగుతున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి.