ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థలు సంయుక్తంగా తయారుచేసిన వ్యాక్సిన్‌కు జపాన్‌లో ఆమోదం లభించింది. వ్యాక్సిన్‌ను ఆమోదిస్తున్నట్టు జపాన్ ఆరోగ్యశాఖ ఆదివారం ప్రకటనను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైనప్పటికి జపాన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఏ ఒక్క వ్యాక్సిన్‌కు కూడా ఆమోదం తెలుపలేదు. ఇప్పుడు ఫైజర్ వ్యాక్సిన్‌కు మొట్టమొదటగా ఆమోదం లభించడం విశేషం. వ్యాక్సిన్‌కు ఆమోదం లభించడంతో త్వరలోనే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
గత శుక్రవారం జపాన్‌కు దాదాపు 4 లక్షల ఫైజర్ వ్యాక్సిన్ డోస్‌లు చేరుకున్నాయి. మొదటగా దాదాపు 20 వేల మంది ఫ్రంట్-లైన్ మెడికల్ సిబ్బందికి వ్యాక్సిన్ మొదటి డోస్‌ను ప్రభుత్వం ఇవ్వనుంది. ఇదిలా ఉంటే.. జపాన్‌లో ఇప్పటివరకు మొత్తం 4,14,472 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి దేశవ్యాప్తంగా 6,912 మంది మృత్యువాతపడ్డారు.