ఒక్క సీసీ కెమెరా.. వందమంది పోలీసులతో సమానం.

 


ఒక్క సీసీ కెమెరా.. వందమంది పోలీసులతో సమానం. తరచూ పోలీసు ఉన్నతాధికారులు అనే మాటలు. నూటికి నూరుపాళ్లు వాస్తవమే. నేర ఛేదనలో మూడోకన్ను (సీసీ కెమెరాలు) కీలకంగా మారుతున్నది. అత్యంత సేఫ్‌ సిటీగా ఖ్యాతిగాంచిన భాగ్యనగరంలో అనేక కేసుల గుట్టు విప్పడంలో ఈ కెమెరాలే చోదకాలుగా వ్యవహరిస్తున్నాయి. అడుగడుగునా నిఘా నేత్రాలు ఉండడంతో నగరంలో నేరం చేయడం సులువు కాదన్న అభిప్రాయం వచ్చిందంటే వీటి ప్రాముఖ్యత అర్థమవుతున్నది. కీసర ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్‌ డ్రామా కేసులోనూ ఇవే కెమెరాలు వాస్తవాల్ని బయటపెట్టాయి. అమ్మాయి కదలికల్ని, ఆటోడ్రైవర్ల సంచారాన్ని బయటపెట్టి కిడ్నాప్‌ ఉత్తదనే నిర్ధారించాయి. గ్రేటర్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ప్రసుత్తం 6.10 లక్షల సీసీ కెమెరాలున్నాయి. జనాభా సంఖ్యతో పోల్చితే ప్రతి వెయ్యిమందికి 30 సీసీ కెమెరాలున్నట్లు లెక్క. ఈ ఏడాది చివరినాటికి పది లక్షల కెమెరాలు బిగించాలన్నది లక్ష్యం.


పోలీస్‌ అనగానే ఖాకీ దుస్తులు... తుపాకులు... ఇవేగుర్తొస్తాయి. శాంతిభద్రతల పరిరక్షణలో ఆయుధాలు పోలీసులకు అస్ర్తాలుగా ఉంటాయి. కానీ ఇప్పుడు పోలీసుల అమ్ముల పొదిలో ఏకే-47 కంటే పవర్‌ఫుల్‌ ఆయుధాలు చేరాయి. అవే... సీసీ కెమెరాలు. ఒక్క సీసీ కెమెరా వంద పోలీసులతో సమానం అన్నట్లుగా కేసుల ఛేదనలో అత్యంత కీలకంగా మారుతున్నాయి. అందుకే అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న జాబితాలో ప్రపంచంలోనే హైదరాబాద్‌ టాప్‌-20లో స్థానం సాధించగా.. దేశంలోనే ముందు వరుసలో నిలిచింది.


ఒకప్పుడు ఒక కేసును ఛేదించాలంటే పోలీసులకు నెలల తరబడి సమయం పట్టేది. పైగా విజయవంతంగా కేసు ఛేదన జరుగుతుందనేది కూడా నమ్మకం లేని పరిస్థితి. కానీ ఇప్పుడు?! హైదరాబాద్‌ మహానగరంలో పోలీసులు గంటలు... రోజుల వ్యవధిలోనే అత్యంత క్లిష్టమైన మిస్టరీ కేసుల్ని సైతం సునాయాసంగా ఛేదిస్తున్నారు. కారణం... సీసీ కెమెరాలు. ప్రతి కెమెరా నిఘా నేత్రంగా పని చేస్తుండటంతో నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ అత్యంత సులువుగా మారుతుంది. వాస్తవానికి తెలంగాణ వచ్చిన సమయంలో నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటు అనేది నామమాత్రం. కేవలం కార్పొరేట్‌ కంపెనీలు తమ భవనాల్లో మాత్రమే వీటిని ఏర్పాటు చేసుకునేవి. కానీ ఇప్పుడు... తెలంగాణ ప్రభుత్వం సీసీ కెమెరాల ఏర్పాటును ఒక యజ్ఞంలా చేపట్టడం ఒకవంతైతే... పోలీసులు వాటిని విజయవంతంగా వినియోగించుకుంటున్నారు. అందుకే సాధారణ నేరాలు మొదలు పెద్ద పెద్ద మిస్టరీల్లోనూ పోలీసులకు సీసీ కెమెరాలు దారి చూపుతున్నాయి. ఇప్పటివరకు హైదరాబాద్‌ నగరంలో ఛేదించిన దాదాపు అన్ని కేసుల్లోనూ సీసీ కెమెరాల పాత్ర ఉండగా... తాజాగా కీసర ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్‌ డ్రామా కేసులోనూ ఇవే కెమెరాలు వాస్తవాల్ని బయటపెట్టాయి.


పది లక్షలు లక్ష్యంగా..


ప్రస్తుతం హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 6.10 లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ ఏడాదిలో వీటి సంఖ్యను పది లక్షలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. ఈ మేరకు పోలీసు యంత్రాంగం కూడా ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియను ముమ్మరంగా చేపడుతున్నది. అయితే ఇప్పటి వరకు ఉన్న సీసీ కెమెరాల సంఖ్యను పరిశీలిస్తే... మూడు కమిషనరేట్ల పరిధిలో ప్రతి వెయ్యి మందికి ఏకంగా 30 సీసీ కెమెరాలు ఉన్నట్లుగా తేలింది. దేశంలోని ఇతర ఏ ప్రధాన నగరాల్లోనూ ఈ స్థాయిలో సీసీ కెమెరాలు లేకపోవడం గమనార్హం. ఢిల్లీ, ముంబై వంటి మహా నగరాల్లోనూ ఈ స్థాయిలో కెమెరాలు లేవు. అదేవిధంగా ప్రపంచంలోని ప్రధాన మెట్రో నగరాల జాబితాను పరిశీలించినా... టాప్‌-20లో హైదరాబాద్‌ ఉండటం విశేషం.