మహిళల రక్షణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు ఉద్యోగులు, విద్యార్థులు, టూరిస్టు మహిళల రక్షణకు బాటలు వేస్తున్నది. ఇందులో భాగంగా తొలిసారిగా హైదరాబాద్ జిల్లాలో షీ ట్యాక్సీ పథకానికి శ్రీకారం చుట్టింది. అందుకు సంబంధించి అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా సంక్షేమాధికారి అక్కేశ్వర్రావు ఒక ప్రకటనలో వెల్లడించారు. నిరుపేద కుటుంబాల్లోని మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వడంతో పాటు సబ్సిడీపై ట్యాక్సీలను అందించనున్నామన్నారు. 10వ తరగతి చదివి, 18ఏండ్ల వయస్సు పైబడిన మహిళలు ఈ పథకానికి అర్హులన్నారు. ఎంపికైన మహిళలకు 35శాతం సబ్సిడీ, 10శాతం మార్జిన్ మనీతో మొత్తం 45శాతం బ్యాంకు రుణంతో ట్యాక్సీలను అందించనున్నారు. అదేవిధంగా నెల రోజుల పాటు డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చి ప్రొఫెషనల్ క్యాబ్ డ్రైవర్లుగా తీర్చిదిద్దనున్నారు. ఆసక్తి ఉన్న మహిళలు ఈ నెల 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి అక్కేశ్వర్రావు స్పష్టం చేశారు. వివరాలకు హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలోని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో లేదా సీడీపీవో కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు.