రాజ్‌భవన్ అన్నం పేదలకు రెండు పూటల భోజనం..నామ మాత్రపు చార్జిలతో

 తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టబోతోన్నారు. ఇదివరకెప్పుడు ఏ గవర్నర్ కూడా ఈ తరహా కార్యక్రమాన్ని చేపట్టి ఉండకపోవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవంటూ మొన్నటికి మొన్న ప్రకటించిన ఆమె.. ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుండటం ఆసక్తి రేపుతోంది. గవర్నర్‌గా ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని తమిళిసై దీన్ని ప్రారంభించనున్నారు.  ఈ కార్యక్రమం పేరు- రాజ్‌భవన్ అన్నం. ఈ మధ్యాహ్నం ఇది ప్రారంభం కానుంది. సోమాజీగూడలోని రాజ్‌భవన్ దీనికి వేదిక కానుంది. రాజ్‌భవన్ ఆవరణలో ప్రతిరోజూ పేదలకు రెండుపూటల భోజనాన్ని అందించే కార్యక్రమం ఇది. మధ్యాహ్నం, రాత్రి పేదలకు భోజన సదుపాయాన్ని కల్పించనున్నారు. ఇది ఉచితం కాదు. నామమాత్రంగా డబ్బులను చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి రోజూ 500 మందికి నామమాత్రపు ఛార్జితో భోజన సదుపాయాన్ని కల్పించాలనేది ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.  కేసీఆర్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవంటూ తమిళిసై ఇటీవలే ప్రకటించారు. రాజ్యాంగబద్ధంగా తాను వ్యవహరిస్తున్నాననీ చెప్పారు. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియామకంలో చోటు చేసుకున్న జాప్యం పట్ల ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో- కేసీఆర్ ప్రభుత్వంతో ఘర్షణ వైఖరిని అనుసరిస్తున్నారనే వాదనలను తమిళిసై తోసిపుచ్చారు. ఛాన్సలర్ హోదాలో ఉన్న తాను వైస్ ఛాన్సలర్ల నియామకం గురించి ప్రశ్నించడంలో తప్పు లేదని పేర్కొన్నారు.  ఈ ప్రకటన చేసిన కొద్దిరోజుల్లోనే రాజ్‌భవన్ అన్నం కార్యక్రమాన్ని ప్రారంభించబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని, పేదలకు సహాయం చేయడానికి, వారి కడుపు నింపడానికి గవర్నర్ ముందుకు రావడం స్వాగతించదగ్గదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.