మూడో వన్డేలో ఇంగ్లాండ్ పై టీమ్ ఇండియా ఘన విజయం. మరోసారి సొంతగడ్డపై సత్తా చాటిన టీమిండియా. 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను కైవసం .

 


భారత జట్టు మరోసారి సత్తాచాటింది. సొంతగడ్డపై కోహ్లీ సేన ఇంగ్లాండ్‌పై ఆధిపత్యాన్ని ప్రదర్శించి వన్డే సిరీస్‌ను సైతం కైవసం చేసుకుంది. ఇప్పటికే టెస్టు, టీ20 సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత్.. వన్డే సిరీస్‌ను కూడా వశం చేసుకొని రికార్డు సృష్టించింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన చివరి మ్యాచ్‌లో కోహ్లీ సేన అదరగొట్టి ఏడు పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన అన్ని ఫార్మాట్ల సిరీస్‌లను క్లీన్‌స్వీప్‌ చేసుకొని భారత్ దుమ్మురేపింది. పూణేలో జరిగిన ఆఖరి వన్డేలో 330 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు మొదట్లోనే తడపడింది. ఆ తర్వాత రాణించినప్పటికీ.. చివరకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 50 ఓవర్లకు 322 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో ఇంగ్లాండ్‌ విజయానికి 14 పరుగులు అవసరం కాగా.. బంతిని అందుకున్న నటరాజన్‌ కేవలం 6 పరుగులే ఇచ్చి భారత్‌కు విజయాన్ని అందించాడు. ఛేదనలో ఇంగ్లాండ్ జట్టులో సామ్‌ కరన్‌ (83 బంతుల్లో 95 నాటౌట్) రాణించగా, డేవిడ్‌ మలన్‌ (50) అర్ధశతకం, బెన్‌స్టోక్స్‌ (35), లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (36) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. చివర్లో సామ్‌ కరన్‌ పోరాటం వృథా అయింది. భారత బౌలర్లలో శార్దుల్‌ ఠాకూర్‌ 4 వికెట్లు, భువనేశ్వర్‌ కుమార్‌ 3 వికెట్లతో ప్రత్యర్థి జట్టును దెబ్బతీశారు. అంతకు ముందు టీమిండియా ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీిమిండియా‌ 48.2 ఓవర్లలో 329 పరుగులకే ఆలౌటైంది. శిఖర్‌ ధావన్‌(67/56 బంతుల్లో 10ఫోర్లు), రిషబ్‌ పంత్‌(78/ 62 బంతుల్లో 5ఫోర్లు,4సిక్సర్లు), హార్దిక్‌ పాండ్య(64/ 44బంతుల్లో 5ఫోర్లు, 4సిక్సర్లు) సూపర్ ఆటతీరుతో విరుచుకు పడ్డారు. ఆరంభంలో రోహిత్‌ శర్మ(37), ఆఖర్లో శార్దుల్‌ ఠాకూర్‌(30) కీలక ఇన్నింగ్స్‌ ఆడి ఇంగ్లాండ్ ముందు భారీ స్కోర్‌ పెట్టగలిగారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో మార్క్‌వుడ్‌ మూడు వికెట్లు తీయగా..అదిల్‌ రషీద్‌ గూగ్లీలతో రెండు వికెట్లు తీశాడు. అయితే టీమిండియాకు రోహిత్‌-ధావన్ శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 103 పరుగుల భాగస్వామ్యం అందించారు. చరిత్రలో ఓ రికార్డ్ భాగస్వామ్యంను నెలకొల్పారు. స్వల్ప వ్యవధిలోనే రోహిత్‌, ధావన్‌, కోహ్లీ(7) పెవిలియన్ దారి పట్టారు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన పంత్‌ తుఫాన్‌లాంటి ఆటతో ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కులు చూపించాడు. 157/4తో ఇబ్బందుల్లో పడిన జట్టును పంత్‌, హార్దిక్‌ క్రీజులో నిలిచి ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించారు. వీరిద్దరూ 100 పరుగుల భాగస్వామ్యం అందించారు.