2022 నాటికి చంద్రయాన్ -3 ప్రయోగనికి కార్యాచరణ సిద్ధం చేస్తున్న ఇస్రో సంస్ధ.

 


న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నది. చంద్రునిపై మూడవ మిషన్ చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-3ను 2022 మధ్య కాలంలో ప్రయోగించనున్నారు. తరువాతి దశాబ్దంలో హెవీ-లిఫ్ట్ లాంచ్ వెహికిల్‌తో పాటు అనేక అధునాతన సామర్థ్యాలను ఇస్రో లక్ష్యంగా పెట్టుకున్నది. ఇది 16-టన్నుల పేలోడ్లను జియోస్టేషనరీ ట్రాన్స్‌ఫర్ కక్ష్యకు తీసుకువెళ్ళగలదు. పాక్షికంగా, పూర్తిగా పునర్వినియోగపరిచే ప్రయోగ వాహనాలను కూడా అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇస్రో చైర్మన్‌ డాక్టర్ కే శివన్ తెలిపారు. ఇస్రో ఇప్పటికే చాలా రికార్డులను సొంతం చేసుకుంది. అగ్రరాజ్యాల అంతరిక్ష పరిశోధన సంస్థలకు దీటుగా ప్రగతి సాధిస్తున్నది. ఇప్పటికే చంద్రయాన్-1, చంద్రయాన్-2 పేరిట రెండు మిషన్లను చంద్రునిపైకి ప్రయోగించింది. కొవిడ్ మహమ్మారి కారణంగా దాదాపు అన్ని రంగాల్లోనూ ఇంచుమించు ఏడాది విలువైన కాలం వృధా అయిన పరిస్థితి.. ఇస్రోకు కూడా ఎదురైంది. 2020లో చేపట్టాల్సిన చంద్రునిపై మూడవ మిషన్ వాయిదా పడింది. చంద్రయాన్-3 ను 2022 మధ్యలో ప్రయోగించేందుకు ఇస్రో కార్యాచరణ సిద్ధం చేసింది. దీనికోసం చంద్రయాన్-2లో ప్రయోగించిన ఆర్బిటార్‌నే చంద్రయాన్-3లో ఉపయోగిస్తామని చెప్పారు. 'భారతదేశంలో ఏరోస్పేస్, ఏవియానిక్స్ భవిష్యత్‌'పై యూపీఈఎస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి డాక్టర్ కే శివన్‌ ప్రసంగించారు. ఇస్రో చంద్రయాన్-3, ప్రతిష్టాత్మక హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రాం (గగన్‌యాన్) పై మాట్లాడారు. 'మేం చంద్రయాన్-2 యొక్క లోపాలను గుర్తించి అర్థం చేసుకున్నాం. తదుపరి మిషన్ కోసం దిద్దుబాటు చర్యలు తీసుకున్నాం. వీటిని మేం 2022 మొదటి భాగంలో ప్రారంభించబోతున్నాం. గగన్‌యాన్ డిజైన్ చివరి దశలో ఉన్నది. ఈ సంవత్సరం చివరి నాటికి మొదటి మానవరహిత మిషన్ ట్రయల్ జరుగుతుంది' అని కే శివన్‌ తెలిపారు. రాబోయే సంవత్సరానికి, సమీప భవిష్యత్తులో ఇస్రో ప్రణాళికలను వివరిస్తూ, జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (జీటీఓ) కు పేలోడ్ సామర్ధ్యం 5 టన్నులకు, ప్రస్తుత జీఎస్ఎల్వీ ఎంకే 3 పై సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ ఉపయోగించి పెరిగేలా చేస్తున్నామని చెప్పారు. రాకెట్. సెమీ-క్రియో ఇంజన్లు శక్తివంతమైనవని, పర్యావరణ అనుకూలమైనవని, తక్కువ ఖర్చుతో కూడుకున్నవని తెలిపారు. మరింత శక్తివంతమైన బూస్టర్ దశల అవసరాన్ని శివన్ ప్రస్తావించారు. మరింత శక్తివంతమైన 2000 న్యూటన్ లిక్విడ్ ఆక్సిజన్, కిరోసిన్ ఇంజన్ల పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. చంద్రయాన్-3 ప్రయోగాన్ని ఇస్రో చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నది. భవిష్యత్‌లో ఇస్రో చేపట్టనున్న గ్రహాంతర ప్రయోగాలకు చంద్రయాన్-3 కీలకం కానున్నది. గగన్‌యాన్ ద్వారా ముగ్గురు భారతీయుల్ని అంతరిక్షంలోకి ఇస్రో పంపనున్నది. దీనికోసం ఎంపికైన పైలట్లు ప్రస్తుతం రష్యాలో శిక్షణ పొందుతున్నారు.