నాలుగో టి20 మ్యాచ్ కు సిద్ధమైన భారత్.

 


ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టీ20 సిరీస్‌ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ అధిక్యంలో నిలిచింది. ఇక రెండో టీ20లో సునాయసంగా గెలుపొందిన భారత్‌ మళ్లీ మూడో మ్యాచ్‌లో తడబడింది. మొదటి మ్యాచ్‌లో విఫలమైన బ్యాట్స్‌మన్‌ మరోసారి మూడో టీ20లోనూ తడబడడంతో టీమిండియా ఓటమిని చవి చూడాల్సివచ్చింది. ఈ క్రమంలోనే నేడు అహ్మదబాద్‌ వేదికగా జరుగుతోన్న నాలుగో మ్యాచ్‌పై అందరి దృష్టి పడింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్‌ ఎంత వరకు రాణిస్తుందో అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిరీస్‌లో కొనసాగాలంటే భారత్‌ ఈ మ్యాచ్‌ను గెలవాల్సిందే. ఈ క్రమంలోనే భారత జట్టులో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా అన్న దానిపై చర్చ జరుగుతోంది. మూడు మ్యాచ్‌లలో విఫలమైన కేఎల్‌ రాహుల్‌ను కొనసాగిస్తారా.? విశ్రాంతి ఇస్తారా అన్న దానిపై ఆసక్తి నెలకొని ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో శార్దుల్‌కు బదులుగా దీపక్‌ చహర్‌ను ఆడించాలని టీమిండియా భావిస్తోంది. ఇక భారత్‌ పరిస్థితి ఇలా ఉంటే రెండు మ్యాచ్‌లు గెలిచి ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్‌ ఎలాగైనా ఈ మ్యాచ్‌ను గెలిచి టెస్ట్‌ సిరీస్‌లో ఓటమికి సమాధానం చెప్పాలని సిద్ధమవుతోంది. ఇక ఇంగ్లాండ్‌ జట్టు బ్యాటింగ్‌ పటిష్టంగా ఉంది. గత మ్యాచ్‌లో బట్లర్‌ దూకుడుగా ఆడడంతో మ్యాచ్‌ ఇంగ్లాండ్‌ వశమైపోయింది. ఇక ఈ మ్యాచ్‌కు టాస్‌ కూడా కీలకంగా మారనుంది. గడిచిన మూడు మ్యాచ్‌లను గమనిస్తే టాస్‌ గెలిచి మొదట ఫీల్డింగ్‌ ఎంచుకున్న జట్టే గెలిచింది. మరి టీమిండియాకు చావో రేవోలా మారిన ఈ మ్యాచ్‌లో రాణిస్తుందో లేదో చూడాలి. అహ్మదాబాద్‌ వేదికగా మొతెరా స్టేడియంలో గురువారం సాయంత్రం మ్యాచ్‌ ప్రారంభంకానుంది.