త్వరలో 90 రైల్వేస్టేషన్ల ప్రైవేటీకరణ.

 


వ్యాపారం చేయడం ప్రభుత్వం బాధ్యత కాదంటూ పదే పదే చెబుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతీ రంగంలోను ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో కేంద్ర ప్రభుత్వానికి వున్న వాటాను విక్రయిస్తున్న మోదీ సర్కార్.. దేశంలో మరిన్ని రంగాల్లోను ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచాలని తలపెట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా తొలి విడతగా దేశంలోని తొంభై రైల్వే స్టేషన్లను ప్రైవేటికరించేందుకు ప్రణాళిక రచించారు. ఈ మేరకు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి. హిందుస్తాన్ టైమ్స్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం రైల్వేస్టేషన్లను ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్దమవుతోంది. ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించే రైల్వేస్టేషన్లలో ఎయిర్‌పోర్టుల్లో వుండే సదుపాయాలను కల్పించాలని తలపెట్టింది. సెక్యూరిటీ, మౌలిక సదుపాయాలు సహా రూపు రేఖలను కూడా ఎయిర్‌పోర్టుల తరహాలో తీర్చి దిద్దేందుకు యత్నాుల ముమ్మరం చేసింది కేంద్ర ప్రభుత్వం. వరల్డ్‌వైడ్‌గా చూస్తే భారతీయ రైల్వేలు నాలుగో అతిపెద్ద నెట్‌వర్క్‌ని కలిగి వున్నాయి. 2019లోనే కొన్ని రైల్వేస్టేషన్లలో మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రైవేటు-ప్రభుత్వ భాగస్వామ్యంతో సర్వీసులు ప్రారంభించాలన్న ప్రతిపాదన వచ్చింది. పీపీపీ విధానంలో కొన్ని రైల్వేస్టేషన్ల నిర్వహణ కేంద్రం అప్పట్లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పీపీపీ అమలును ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్‌మెంటు కార్పొరేషన్ (ఐఆర్ఎస్డీసీ) పర్యవేక్షించనున్నది. ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న తొంభై రైల్వే స్టేషన్లలో సెక్యూరిటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెసిలీటీస్ ఎలా, ఏ మేరకు కల్పించాలనే అంశంపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), రైల్వే జోన్ల చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ల నుంచి అభిప్రాయ సేకరణ ప్రస్తుతం జరుగుతోంది. వారి అభిప్రాయాలను పంచుకోవాల్సిందిగా రైల్వే బోర్డు చీఫ్ సెక్యురిటీ కమిషనర్లకు, ఆర్పీఎఫ్ చీఫ్‌లకు లేఖలు రాసింది. ప్రస్తుతం ఎయిర్‌పోర్టుల్లో వున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) లాగానే రైల్వేస్టేషన్లలో సెక్యూరిటీ వ్యవహారాలను మార్చాలని ప్రతిపాదిస్తున్నారు. ఈ ప్రతిపాదన ప్రకారం రైల్వే స్టేషన్లను నిర్వహించే ప్రైవేటు సంస్థలే సీఐఎస్ఎఫ్ బలగాలకు వేతనాలు చెల్లించాల్సి వుంటుంది. ఇపుడు ఎయిర్‌పోర్టుల్లో వున్న సెక్యూరిటీ సిస్టమ్‌ను ప్రైవేటు రైల్వే స్టేషన్లలోను అమలు చేయాలని రైల్వే బోర్డు ప్రతిపాదిస్తోంది. ఈ ప్రతిపాదనపై మార్చి 15వ తేదీలోగా అభిప్రాయాలను తెలపాలంటూ రైల్వే బోర్డు రాసిన లేఖల్లో కోరింది. 150 రైళ్లు, యాభై రైల్వే స్టేషన్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం కోసం బ్లూప్రింట్ రూపొందించడానికి ఒక కమిటీని 2019 అక్టోబర్‌లో ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. నాగ్‌పూర్, గ్వాలియర్, అమృత్ సర్, సబర్మతి, నెల్లూరు, పుదుచ్చేరి, డెహ్రాడూన్, తిరుపతి రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం బిడ్డింగ్ అర్హత ప్రక్రియను 2020 సెప్టెంబర్‌లో ప్రారంభించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటికే గాంధీనగర్, హబీబ్‌గంజ్ వంటి స్టేషన్లలో నిర్మాణ పనులు యుద్దప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఆనంద్ విహార్, బిజ్వాసన్, చండీగఢ్ వంటి రైల్వే స్టేషన్లలో మార్పులు చేర్పులు చేపట్టేందుకు టెండర్లు పిలిచి.. కాంట్రాక్టులను కూడా ఇచ్చేశారు. రైల్వే పునరాభివృద్ధి చేస్తున్న స్టేషన్లలో రైలు ఛార్జీలపై అదనపు రుసుము వసూలు చేయాలనీ చూస్తుంది. ఇంకోవైపు 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొదట 12 ప్రైవేట్ రైళ్లు, 2027 నాటికి 151 రైళ్లను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం బావిస్తున్నట్లు తెలుస్తోంది.