హైదరాబాద్ పాత బస్తీలో దారుణ హత్య.

 


హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య జరిగింది. శుక్రవారం నాడు ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ మొహమ్మద్ జబెర్‌ను కొందరు దుండగులు దారుణంగా హతమార్చారు. కత్తులతో వెంటాడి వేటాడి నడి రోడ్డుపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొహమ్మద్ జబెర్ కాలాపత్తర్ రౌడీ షీటర్. మైలర్‌దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్తఫా నగర్‌లో ప్రస్తుతం అతను నివాసం ఉంటున్నాడు. అయితే, ఇవాళ సాయంత్రం మొహమ్మద్ జబెర్‌ను ఫలక్‌నుమా అన్సారీ రోడ్‌లో కొంత మంది దుండగులు కత్తులతో వెంటాడు. అతన్ని దొరికబుచ్చుకుని మరీ దారుణంగా హతమార్చారు. ఈ ఘటనను చూసిన స్థానిక ప్రజలు భయంతో హడలిపోయారు. కళ్లముందే దారుణం జరుగుతున్నా ఏం చేయలేకపోయారు. దుండగులు వెళ్లిపోయిన తరువాత అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం జబెర్‌ను ఉస్మానియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలిస్తున్న సమయంలో మృతి చెందాడు. ఇంతలో ఘటనా స్థలానికి చేరుకున్న సౌత్ జోన్ డీసీపీ గజా రావు భూపాలు, క్లూస్ టీమ్ అక్కడి ప్రాంతాన్ని పరిశీలించారు. క్లూస్ సేకరించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. కాగా, గతేడాది జులై నెలలో కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శానుర్ ఖాజీ హత్య కేసులో జబేర్ ప్రధాన నిందితుడు. ఆ హత్య నేపథ్యంలోనే శానుర్ ఖాజీ అనుచరులు ఇవాళ జబేర్‌ను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనా వచ్చారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఇదిలాఉంటే.. రెండు రోజుల క్రితమే హైదరాబాద్ పాతబస్తీలో మొహద్ పర్వేజ్ అలియాస్ ఫిరోజ్ అలియాస్ ఫారు అనే రౌడీ షీటర్‌ను దారుణంగా హతమార్చారు దుండగులు. ఆ ఘటన మరువక ముందే కొద్ది రోజుల వ్యవధిలోనే మరో దారుణ హత్య చోటు చేసుకోవడం పాతబస్తీలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.