టైర్లు లేని ట్రాక్టర్..

 


ఖమ్మం రూర‌ల్ మండ‌లం మ‌ద్దుల‌ప‌ల్లిలో నూత‌న మోడ‌ల్ టైర్లు లేని ట్రాక్టర్ అందరికీ ఆకట్టుకుంటుంది. ఖ‌మ్మం వైపు నుంచి హైద‌రాబాద్ వేళ్లే ర‌హ‌దారిపై మంగ‌ళ‌వారం సాయంత్రం ఒక వ్యక్తి ఈ ట్రాక్టర్‌ను న‌డుపుకుంటూ తీసుకెళ్లారు. దీనికి టైర్లు లేకుండా ఎండ్ల బండి లాంటి చ‌క్రాలు ఉండ‌టంతో గ్రామ‌స్తులు దీనిని చూసేందుకు ఎగ‌బ‌డ్డారు. ఇప్పటివరకు ఇలాంటి చ‌క్రాలు ఉన్న ట్రాక్టర్‌ను చూడ‌లేదని, ఇదే మొద‌టిసార‌ని అంటున్నారు. ఈ ట్రాక్టర్‌తో ప‌త్తి, మిర‌ప, మొక్కజొన్న చేలల్లో పాట్లు వేస్తే చెట్లు విర‌గ‌కుండా ఉంటాయని య‌జ‌మాని చెప్పాడు. రైతులకు ఇది చాలా ఉపయోగపడుతుందని వెల్లడించాడు. ఇలాంటి ట్రాక్టర్‌ను కంపెనీలు నేరుగా త‌యారు చేయ‌డం లేద‌ని, దీనిని ప్రత్యేకంగా త‌యారు చేయించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. వీటిని త‌యారు చేసే వ్యక్తి కోదాడ‌లో ఉన్నట్లు తెలిపారు. దీన్ని రూ.70 వేలు పెట్టి త‌యారు చేయించిన‌ట్టు తెలియ‌జేశాడు. గ‌తంలో ఎద్దులతో అర‌క క‌ట్టి పాటు చేస్తే ఒక అర‌క దు‌న్నే వ్యక్తితో పాటు ఇద్దరు కూలీలు అవ‌స‌ర‌మ‌య్యేవార‌ని, చెట్లు విరిగితే వాటిని లేప‌డానికి వారు అర‌క వెనుకాలే ఉండాల్సి వ‌చ్చేద‌ని తెలిపాడు. ఈ ట్రాక్టర్‌తో చెట్లకు ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌కుండా ఉంటుంద‌ని అన్నాడు. ఖ‌ర్చు కూడా చాలా త‌గ్గుతుంద‌‌న్నాడు. ప‌ని కూడా సులువుగా అవుతుంద‌ని అన్నాడు. ప‌త్తి, మిర‌ప‌, మొక్కజొన్న ఇత‌ర పంట‌ల‌కు బాగా ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని, ఒక్క చెట్టు కూడా చావ‌కుండా దున్నవచ్చని అంటున్నాడు. దీంతో ఖమ్మం ప్రాంతంలో రైతులు ట్రాక్టర్‌ను ఈ మోడల్ ప్రకారం చేయించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.