తెలంగాణ సర్కారు ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

 


కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కారు ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇవాళే దీనికి సంబంధించిన జీవో కూడా రిలీజ్ చేసింది. తద్వారా గ్రామ పంచాయతీలకు అద్భుతమైన అవకాశాన్ని కట్టబెట్టింది. గ్రామ పంచాయతీ నిధులను, పై అధికారుల నుంచి అనుమతులు లేకుండానే, ఆయా గ్రామ ప్రజలు, పంచాయితీల తీర్మానం మేరకు ఖర్చు చేసుకునే వీలు కల్పిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జీవో 91 ని జారీ చేసింది. దీంతో ఇక మీదట స్థానిక అవసరాల మేరకు నిధులను ఖర్చుచేసుకునే వెసులుబాటు పంచాయతీలకు లభిస్తుంది. అంతేకాదు, గ్రామ సభ ఆమోదం మేరకు గ్రామ అవసరాలకు అనుగుణంగా ప్రయారిటీల ప్రకారం గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఆయా పనులన్నీ నిబంధనల మేరకు మాత్రమేగాక, ఆ ఆర్థిక సంవత్సర కేటాయింపులకు మించకుండా మాత్రమే ఖర్చు చేయాలని కూడా ప్రభుత్వం సదరు జీవోలో పేర్కొంది. కాగా, గతంలో లక్ష లోపు పనులకు డీపీఓలు, ఆపై పనులకు ఆ పై ఉన్నతాధికారుల అనుమతులు అవసరం ఉండేవి. ఈ జీవోతో ఆ అనుమతులు అవసరం లేకుండానే, సంక్రమించే అధికారాలను గ్రామాలు ఇక మీదట సద్వినియోగం చేసుకోబోతున్నాయి. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులు, ప్రజలకు ఇదొక మంచి అవకాశమని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది. మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమాలో ఇలాంటి ఫార్ములానే గ్రామాల్లో తీసుకు రావాలనే సీన్ ని దర్శకుడు పిక్చరైజ్ చేసిన సంగతి తెలిసిందే.