మహబూబాబాద్ లో బిజేపి భారీ ర్యాలీ.

 


తెలంగాణలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం రోజురోజుకు హీటెక్కుతుంది. అటు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇటు స్వతంత్ర అభ్యర్థులు సైతం ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు ధీటుగా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. ర్యాలీలు, సభలతో ప్రచారం హోరెత్తిస్తున్నాయి. పోలింగ్‌కు మరికొన్ని రోజులు మాత్రమే ఉండటంతో ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ ప్రచారంలో దూసుకెళ్తుంది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని కార్గిల్ స్తూపం నుండి సబ్ స్టేషన్ వరకు బారీ ర్యాలీ నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ ఉద్యమ నేపద్యం నుండి రాజకీయ పార్టీగా అవతరించిన తర్వాత పార్టీలో ఉద్యమ ద్రోహులు, తెలంగాణ ద్రోహులతో నిండి పోయిందని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌ కుమార్‌ విమర్శించారు. సిఎం కేసీఆర్ కు బుద్ధి చెప్పాలంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాజాపా కు పట్టం కట్టాలని పార్టీ శ్రేణులకు దిలీప్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన డోర్నకల్ నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల సమ్మేళనానికి దిలీప్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ….. సీఎం కేసీఆర్ అంటే నే ఓ మాయ, జిత్తులమారి రాజకీయ నేత అని విమర్శించారు. బట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో భాజాపా గెలుచుకోవడమే కాకుండా, 2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భాజాపా అధికారం లోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసిఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యాడే తప్ప ప్రజలకు ఎనాడూ అందు బాటులో లేడని దిలీప్‌ కుమార్‌ విమర్శించారు. మిగులు బడ్జెట్ గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 3 లక్షల కోట్ల రూపాయల అప్పుల రాష్ట్రంగా దిగజాజార్చడని దుయ్యబట్టారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే యెడల లక్ష్మీనారాయణ, భాజాపా గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్.హుస్సేన్ నాయక్, రాష్ట్ర నాయకులు రాజవర్ధన్ రెడ్డి, రామచంద్రు, లక్ష్మన్ నాయక్ తదితరులు హాజరయ్యారు.