హైదరాబాద్‌ నగరంలో దారుణం.

 


హైదరాబాద్‌ నగరంలో దారుణం చోటు చేసుకుంది. బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకెళితే.. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోని మీర్‌పెట్‌ రాఘవేంద్ర నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ యువతి(20) బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తుంది. కొంతకాలం క్రితం మారెడ్డి ఆశిర్ అనే యువకుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానంటూ నమ్మించిన ఆశిర్.. గత ఏడాది ఫిబ్రవరి 20న ఐశ్వర్యను సంఘీ టెంపుల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆ యువతికి తాళి కట్టాడు. పెళ్లి విషయం ఇంట్లో తెలియడంతో ఇరువురి కుటుంబ సభ్యులు వారి పెళ్లిని అంగీకరించలేదు. యువతిని ఆమె తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. అప్పటినుంచి తల్లిదండ్రుల మీద కోపంతో హాస్టళ్లలో ఉంటోంది బాధిత యువతి. కాగా తాను కుటుంబ సభ్యులను ఒప్పిస్తానని నమ్మబలికిన ఆశిర్.. ఆమెతో బంధాన్ని కొనసాగించాడు. ఇదిలా ఉండగానే ఐశ్వర్య గర్భం దాల్చింది. దాంతో ఇక ఆలస్యం చేస్తే బాగోదని, విషయం తేల్చాలని ఒత్తిడి చేయడం ప్రారంభించింది సదరు యువతి. తనకు కొంత సమయం కావాలని కాలయాపన చేస్తుండడంతో పాటు.. ఆమెకు ఆబార్షన్ చేయించాడు. ఇక ఇటీవల పెళ్లి విషయం ఆడిగేందుకు ఆశిర్ ఇంటికి వెళ్లిగా.. ఆమెను అవమానించి పంపించారు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి.. ఇవాళ తాను ఉంటున్న హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని యువతి మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు