మనకు తెలియని కొత్త నెంబర్ నుంచి కాల్ వస్తే.. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు ఉపయోగించే యాప్ 'ట్రూకాలర్'. ఈ యాప్ చాలా తక్కువ సమయంలో ఎక్కువ డౌన్లోడ్స్ సాధించి మోస్ట్ పాపులర్ యాప్‌గా నిలిచింది. ఇక, ట్రూకాలర్ ఎప్పటికప్పుడు కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది. తాజాగా, యూజర్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ట్రూ కాలర్ సరికొత్త యాప్ విడుదల చేసింది. 'గార్డియన్స్-సేఫ్టీ ఆన్ ది మూవ్' పేరుతో పర్సనల్ సేఫ్టీ కోసం కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుగా ప్లేస్టోర్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఈ గార్డియన్ యాప్ ద్వారా మహిళలు, చిన్నారులకు అదనపు భద్రత చేకూరుతుందని ట్రూకాలర్ పేర్కొంది. ఈ మేరకు దీనిలో 'ఎమర్జెన్సీ' అనే బటన్‌ను కూడా చేర్చామని చెబుతోంది. కాగా, ప్రస్తుత కాలంలో.. చిన్నారులు, మహిళలపై లైంగిక దాడులు పెరుగుతున్నాయి. వాళ్లు బయటికెళ్లి, మళ్లీ ఇంటికి సురక్షితంగా తిరిగొచ్చేంత వరకు కుటుంబ సభ్యులు తెగ టెన్షన్ పడుతుంటారు. ముఖ్యంగా మహిళా భద్రత ప్రశ్నార్థకంగా మారిన ఈ రోజుల్లో 'సేఫ్టీ' అనేది చాలా ముఖ్యం. ఈ మేరకు ఒంటరి ప్రయాణాలు లేదా బయటకు ఎక్కడికైనా వెళ్లిన సందర్భాల్లో ఈ గార్డియన్స్ యాప్ ఎంతో ఉపయోగపడనుంది. గార్డియన్స్ యాప్‌లో స్నేహితులు, కుటుంబ సభ్యులను సంరక్షకులుగా చేర్చవచ్చు. ఇందుకోసం వారికి రిక్వెస్ట్ సెండ్ చేస్తే సరిపోతుంది. వారు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయగానే, మన లైవ్ లొకేషన్‌ను యాక్సెస్ చేయడానికి 'వాచ్ ఓవర్ మీ' ఫీచర్‌ను చేర్చింది. లైవ్ లొకేషన్‌ను మన గ్రూపులోని సభ్యులతో కూడా శాశ్వతంగా షేర్ చేసుకోవడానికి 'ఫరెవర్ షేర్' అనే ఫీచర్‌ను కూడా చేర్చింది. అంతేకాక, గార్డియన్ యాప్‌లో 'హెల్ప్ మీ' అనే బటన్ కూడా ఉంటుంది. ఇది మనం ఎంచుకున్న గార్డియన్‌కు అత్యవసర నోటిఫికేషన్స్‌తో పాటు లొకేషన్ డేటాను సెండ్ చేస్తుంది. అంతేకాదు, ఫోన్ స్టేటస్ డేటా, బ్యాటరీ లెవల్, ఫోన్ ప్రొఫైల్ స్టేటస్ వంటి విషయాలను కూడా గార్డియన్‌కు చేరవేస్తుంది. 1. ట్రూ కాలర్ వినియోగదారులు ప్లేస్టోర్‌లో గార్డియన్ యాప్‌ను డౌన్లోడ్ చేసి ఒకే టాప్‌తో సైన్ ఇన్ అవ్వొచ్చు. 2. ట్రూకాలర్ లేని వినియోగదారులకు ఈ ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. వారు OTP లేదా మిస్డ్ కాల్ ద్వారా వారి మొబైల్ నంబర్‌ను ధృవీకరించాలి. 3. యాప్ ఓపెన్ చేయగానే మిమ్మల్ని మూడు పర్మిషన్స్ అడుగుతుంది. మీ కాంటాక్ట్స్ లేదా గార్డియన్స్లలో ఎవరికి మీ లొకేషన్, ఫోన్ స్టేటస్ వివరాలను షేర్ చేయాలనే విషయాన్ని అడుగుతుంది. 4. వినియోగదారులు వారి అత్యవసర జాబితాలో మూడు వ్యక్తిగత పరిచయాలను ఎన్నుకోవటానికి అనుమతించబడతారు. మీరు వారితో ఎప్పుడు లొకేషన్ షేర్ చేయాలి? ఎప్పుడు ఆపాలి? అనేది కూడా సెట్ చేసుకోవచ్చు. 5. మీరు ఎంచుకున్న గార్డియన్లతో శాశ్వతంగా మీ లొకేషన్‌ను షేర్ చేయడానికి కంపెనీ మిమ్మల్ని అనుమతిస్తుంది. కాగా, మీ వ్యక్తిగత డేటా మరింత భద్రంగా ఉంటుందని, ఇతర ఏ థర్డ్ పార్టీ యాప్‌కు షేర్ చేయబోమని ట్రూకాలర్ వినియోగదారులకు హామీ ఇచ్చింది.