ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలపై స్టే విధించిన హైకోర్టు .

 


పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు స్టే విధించింది. ఏలూరులో ఎన్నికలు నిలిపి వేయాలని హైకోర్టు సోమవారం ఆదేశించింది. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాలో తప్పులు, గ్రామాల విలీనంలో నిబంధనలు పాటించకపోవటంపై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానిపై విచారణ జరిపిన కోర్టు ఓటర్ల జాబితాను సరి చేయాలని మున్సిపల్ శాఖను ఆదేశించింది. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల విషయం అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వార్డుల పునర్విభజన, జనగణన, కులగణన సరిగా చేయకుండానే ఎన్నికలు జరుపుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలు పాటించకుండా ఎన్నికలకు వెళ్తున్నారని ఈ ఏడాది ఫిబ్రవరిలో 14న పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లాడు. దీంతో ఎన్నికల నిర్వహణ నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. పురపాలక ఎన్నికల ప్రచార ఘట్టం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. రాష్ట్రంలో 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. వీటిలో పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన పురపాలకల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు ఈ నెల 10న పోలింగ్‌ నిర్వహించనున్నారు. మరోవైపు, ఎన్నికలు ఆపాలని ఎస్ఈసీకి ఆదేశాలు రాకపోవటంతో ఎన్నికల ప్రక్రియ యథావిధిగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం ఏలూరు కార్పొరేషన్‌లో పరిధిలో 50 డివిజన్లు ఉండగా ఇప్పటికే మూడు డివిజన్లు ఏకగ్రీవం అయ్యాయి. ఇక, మిగిలిని 47 డివిజన్లలో ఎన్నికల నిర్వహణకు అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు.