తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జోరుగా డబ్బు పంపిణీ .

 


ఎమ్మెల్సీ ఎన్నికల్లో జోరుగా డబ్బు పంపిణీ జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఏపీలో జరుగుతున్న టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బుపంచుతూ ఓ గ్యాంగ్‌ దొరికిపోయింది. మచిలీపట్నంలో ఓటర్లకు డబ్బులు పంచుతూ కొందరు దొరికిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొందరు జోరుగా డబ్బులు పంచుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న యూటీఎఫ్‌ నాయకులు వారిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మచిలీపట్నం సెయింట్‌ ఫ్రాన్సిస్‌ హైస్కూల్‌లో ఈ ఘటన జరిగింది. స్వతంత్ర అభ్యర్థి చందు రామారావు తరఫున ప్రచారం నిర్వహిస్తున్న ముగ్గురు.. డబ్బు సంచితో స్కూల్లోకి వచ్చారు. దీంతో యూటీఎఫ్‌ నాయకులు వారిని అడ్డుకుని ఎవరు మీరంటూ ప్రశ్నించేసరికి ఇద్దరు పారిపోయారు. ఒకరిని పట్టుకుని సంచిని చెక్‌ చేయగా.. లక్షరూపాయల నగదు… పాంప్లేట్లు కనిపించాయి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు యూటీఎఫ్‌ ఈసీ సభ్యులు రఘుకాంత్‌. సమాచారం అందుకున్న పోలీసులు డబ్బుసంచితోపాటు.. బొమ్మసారి వీరాంజనేయులు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సమాజంలో టీచర్స్‌ అంటే ఓ మంచి అభిప్రాయం ఉంది. ఇలా డబ్బులు పంచి ఓట్లు కొని.. ఆ అభిప్రాయాన్ని మార్చొద్దంటున్నారు కొందరు ఉపాధ్యాయులు. ఇక్కడ కనిపిస్తున్న విధంగా కవర్లలో డబ్బులు పెట్టి తీసుకున్నా.. తీసుకోకున్నా.. కొందరు టీచర్లకు డబ్బులు ఎర వేస్తున్నారు. ఒక్కొక్కొ ఓటుకు దాదాపు 3వేల నుంచి ఐదువేల రూపాయలు పంచుతున్నట్లు తెలుస్తోంది. టీచర్లు జాగ్రత్తగా ఉండి ఇలాంటి వారిని దగ్గరకు రానివ్వొద్దని కోరుతున్నారు యూటీఎఫ్‌ నాయకులు. అటు తెలంగాణలోనూ డబ్బు పంచుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.