ట్విట్టర్ లో సరికొత్త ఫీచర్.

 


ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగించే సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫామ్‌లలో ట్విట్టర్‌ ఒకటి. మరీ ముఖ్యంగా సెలబిట్రీలు ఎక్కువగా దీనిని ఉపయోగిస్తుంటారు. అమెరికా ప్రధాని నుంచి సినిమా తారల వరకు ఇలా అందరూ ఏ చిన్న విషయాన్ని ప్రపంచంతో పంచుకోవాలనుకున్నా ట్విట్టర్‌లోకి దూరుతుంటారు. అయితే ట్విట్టర్‌లో… ఆ మాటకొస్తే ఏ సోషల్ మీడియాలో యాప్‌లోనైనా పోస్ట్‌ చేసిన తర్వాత దాన్ని ఎడిటింగ్‌ చేసుకునే అవకాశం ఉండదు. ఏదైనా తప్పుగా పోస్ట్‌ చేస్తే సదరు పోస్టును డిలీట్‌ చేసి మళ్లీ కొత్తగా పోస్ట్‌ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మనం పోస్ట్‌ చేసిన తర్వాత కాసేపు ప్రివ్యూ చూపించి.. అందులో ఏమైనా తప్పులు ఉన్నాయో తెలుసుకునే అవకాశంతో పాటు, పోస్ట్‌ను డిలీట్‌ చేసే సౌలభ్యం కూడా ఉంటే బాగుంటుంది కదూ.! అచ్చంగా ఇలాంటి ఆలోచనే చేస్తోంది ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సంస్థ ట్విట్టర్‌. దీంతో ఇకపై ట్వీట్‌ చేసే ముందు ఐదు సెకన్లపాటు చూసుకునే అవకాశం కలగనుంది. ‘అన్‌ డు’ ఆప్షన్‌ పేరుతో తీసుకురానున్న ఈ ఫీచర్‌ ద్వారా ఐదు సెకండ్ల పాటు ‘అన్‌ డు’ అనే ట్యాబ్‌ కనిపిస్తుంది. అంతలోపు ఏమైనా తప్పులు ఉన్నాయని భావిస్తే.. ఆ ట్యాబ్‌పై క్లిక్‌ చేస్తే చాలు ట్వీట్‌ పోస్ట్‌ అవ్వదు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను టెస్టింగ్‌ కోసం కొంత మందికి అందుబాటులోకి తీసుకొచ్చారని సమాచారం. ఎలాంటి సమస్యలు లేవని నిర్ధారించుకున్న తర్వాత ఈ ఫీచర్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. ముఖ్యంగా ఈ ఫీచర్‌ ద్వారా స్పెల్లింగ్‌ మిస్టెక్స్‌కు చెక్‌ పెట్టవచ్చని సంస్థ భావిస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల ట్విట్టర్‌ ఆడియో ట్వీట్‌, స్పేసెస్‌ వంటి సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.