ఇండియన్ స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్‌కు షాక్

 


ఇండియన్ స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్‌కు షాక్ ఇచ్చాడు రష్యా యువ బాక్సర్. వరుసగా విజయాలతో దూసుకుపోతున్న విజేందర్‌కు అర్టిష్ లోప్సన్ బ్రేక్ వేశాడు. వరుసగా 12 బౌట్లలో తిరుగులేకుండా విజయం ఢంకా మోగించిన విజేందర్‌కు 13వ బౌట్‌లో ఓటమి రుచిని చూపించాడు. శుక్రవారం నాడు గోవాలోని సముద్ర తీరంలో మెజెస్టిక్ షిప్‌పై బాక్సింగ్ పోటీలు జరిగాయి. ఎనిమిది రౌండ్‌ల ఈ బౌట్‌లో భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ రష్యా యువ బాక్సర్ అర్టిష్ లోప్సన్ తలపడ్డారు. మొదటి నుంచి తన గెలుపుపై పూర్తి ధీమాతో ఉన్న విజేందర్.. తొలి రౌండ్‌లో బాగానే ఆడాడు. ఆ తరువాతే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రౌండ్ మారుతున్నా కొద్ది లోప్సన్ ఆధిక్యం ప్రదర్శించాడు. పంచ్‌లు, హుక్‌లతో విజేందర్‌పై విరుచుకుపడ్డారు. దాంతో నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి విజేందర్ సింగ్ పూర్తిగా అలిసిపోయాడు. ఐదవ రౌండ్‌లో విజేందర్ పూర్తి డౌన్ అయిపోయాడు. దాంతో రెఫరీ.. బాక్సర్‌ లోప్సన్‌ను విజేతగా ప్రకటించారు. వరుస విజయాలతో దూకుడు మీదున్న విజేందర్‌ను ఐదు రౌండ్లకే నాకౌట్ చేసి.. అతని విజయాల పరంపరకు బ్రేక్ వేశాడు. అయితే లోప్సన్‌ విజయానికి అతని ఎత్తు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఆరడుగుల నాలుగు అంగుళాల పొడవు ఉన్న లోప్సన్.. తన ఎత్తునే అవకాశంగా మలుచుకున్నాడు. ప్రత్యర్థిని ముచ్చెమటలు పట్టించాడు. ఇదిలాఉంటే.. లోప్సన్ ఇప్పటి వరకు ఏడు బౌట్లు ఆడగా.. ఐదింట్లో గెలిచాడు. గెలిచిన ఐదింట్లోనూ మూడు నాకౌట్లు కావడం విశేషం. ఇక మిగిలిన రెండింట్లో ఒకటి ఓడిపోగా.. మరొక బౌట్ డ్రా అయ్యింది. ఇక విజేందర్ సింగ్‌కు ఇది 13 వ బౌట్. ఇప్పటి వరకు ఆడిన 12 బౌట్లలోనూ విజేందర్ విజేతగా నిలిచాడు. తాజాగా ఆడిన 13వ బౌట్‌లో ఓటమి రుచి చూశాడు.