నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థిగా డాక్టర్‌ పానుగోతు రవికుమార్ ఖరారు.

 


నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలకు బీజేపీ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. డాక్టర్‌ పానుగోతు రవికుమార్‌ అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. మంగళవారం రవికుమార్‌ నామినేషన్‌ వేయనున్నారు. త్రిపురారం మండలం పలుగుతండాకు చెందిన పానుగోతు రవికుమార్‌ అంచెలంచెలుగా ఎదుగుతూ వైద్యుడిగా, ప్రజా సేవకుడిగా రాణిస్తున్నాడు. రవికుమార్‌ భార్య సంతోషి కాంగ్రెస్‌ పార్టీ నుంచి సర్పంచ్‌గా గెలుపొంది ఇటీవల బీజేపీలో చేరారు. ప్రస్తుతం రవికుమార్‌ హాలియాలో ఉంటూ ప్రైవేట్‌ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా తిరుమలగిరి జడ్పీటీసీగా పోటీ చేసిన రవికుమార్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సూర్యబాషానాయక్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. మాజీ మంత్రి జానారెడ్డి అనుచరుడిగా ఎదిగిన రవికుమార్.. వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించి భారతీయ జనతా పార్టీలో చేరారు. జూన్ 9, 1985న పానుగోతు హరి, పానుగోతు దస్సి దంపతులకు జన్మించారు. చిన్నతనం నుంచే విద్యలో ప్రావీణ్యం కనబర్చిన రవికుమార్ ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ప్రభుత్వ వైద్యుడిగా ఉద్యోగంలో చేరిన రవికుమార్.. పలు ఆస్పత్రులలో సివిల్ సర్జన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆయనకు భార్య పానుగోతు సంతోషి, మన స్వీత్, వీనస్ అనే పిల్లలు ఉన్నారు. ప్రజా సేవ చేయాలన్న మక్కువతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తొలుత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన.. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. పొలిటికల్‌గానే కాకుండా స్వచ్చంధ కార్యక్రమాల్లో రవికుమార్ పాల్గొంటూ పేదలకు ఎనలేని సేవలందిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్మల ఫౌండేషన్ చైర్మన్, పలు మండలాలలో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.