న్యాయవాద దంపతుల హత్య కేసులో హైకోర్టు కీలక తీర్పు.

 


న్యాయవాద దంపతులైన గట్టు వామన్ రావు, నాగమణి హత్య కేసుపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం.. న్యాయవాది దంపతుల హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని స్పష్టం చేసింది. వామన్ రావు దంపతుల హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన ధర్మాసనం.. వామన్ రావు తండ్రికి ఎంత బాధ ఉందో.. ఈ కోర్టుకు కూడా అంతే బాధ ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దర్యాప్తు ఇప్పటి వరకు సరైన దిశలోనే సాగుతోందని హైకోర్టు అభిప్రాయపడింది. ఇదిలాఉంటే.. వామన్ రావు, నాగమణి హత్యల దర్యాప్తుపై నివేదికను ఏజీ హైకోర్టుకు సమర్పించారు. వామన్ రావు దంపతుల హత్య కోసం నిందితులు ఉపయోగించిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తాము సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు 25 మంది సాక్షులను పోలీసులు విచారించారు. కుంట శ్రీను, చిరంజీవి, కుమార్ వాంగ్మూలాలు మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేశారు. బిట్టు శ్రీను, లచ్చయ్య వాంగ్మూలాల నమోదు కోసం కోర్టులో పోలీసులు దరఖాస్తు చేశారు. సిసి టీవీ, మొబైల్ దృశ్యాలను ఎఫ్ఎస్ఎల్‌కి పంపించామని పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. నిందితులు వాడిన మొబైల్ ఫోన్లను సైతం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అలాగే ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులకు పోలీసు భద్రత కల్పించామన్నారు. కొందరు సాక్షులు పోలీసు భద్రతను నిరాకరించారని కోర్టుకు నివేదించారు. బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, ముగ్గురు ప్రయాణికుల వాంగ్మూలాలు మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేశామన్నారు. ఏడో నిందితుడిని కూడా చేర్చి అరెస్ట్ చేశామన్నారు. ఈ నివేదికను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం.. తుదిపరి విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది.