జమ్మూ కాశ్మీర్ లోని జరిగిన ఎన్ కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు మృతి

 


జమ్మూ కాశ్మీర్ లోని షోపియన్ జిల్లా మునిహాల్ ప్రాంతంలో సోమవారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. పరారైన మరికొందరు టెర్రరిస్టుల కోసం భద్రతా దళాలు గాలిస్తున్నాయి. నిషిధ్ధ లష్కరే-తోయిబాకు చెందిన కొందరు ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో మాటు వేసి ఉన్నారన్న సమాచారం అందడంతో పోలీసులు, భద్రతా దళాలు, గస్తీ సిబ్బంది అక్కడికి వెళ్లగా వారు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అయితే సాయుధ జవాన్ల కాల్పుల్లో మొదట ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. సుమారు రెండు మూడు గంటల కాల్పుల అనంతరం మరో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్టు కనుగొన్నారు. కాగా మరో ఇద్దరు-ముగ్గురు అదే ప్రాంతంలో చిక్కుకుని పోయి ఉన్నట్టు కూడా భావిస్తున్నారు. షోపియాన్ లోనే ఈనెల 16 న జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు టెర్రరిస్టులు మరణించారు. భారత-పాకిస్థాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన జరగరాదని ఇటీవల ఉభయ దేశాలూ నిర్ణయించాయి. అయితే పాక్ ఉగ్రవాదులు మాత్రం రెచ్చగొడుతూ జమ్మూ కాశ్మీర్ లోని జిల్లాల్లో దొంగచాటున ప్రవేశిస్తున్నారు. భారత ఆర్మీ, సెంట్రల్ రిజర్వ్ పోలీసులు, సంయుక్తంగా కొన్ని రోజులుగా ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. పాక్ దళాలు తమ దేశ ఉగ్రవాదులను రెచ్చగొట్టి భారత సరిహద్దుల్లోకి పంపుతున్నారన్న అనుమానాలను ఆర్మీ సిబ్బంది వ్యక్తం చేస్తున్నారు. కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన జరగకుండా వీరు ఈ టాక్టిక్ కి పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇంచుమించు ప్రతి నెలా ఉగ్రవాదులు కాశ్మీర్లో చొరబడుతున్నారు. తమ నిఘా నిరంతరం ఉంటోందని, అయినా ఏదో విధంగా నిషిద్ధ జైషే తోయిబా వంటి సంస్థలకు చెందిన టెర్రరిస్టులు అక్రమంగా మన సరిహద్దుల్లోకి ప్రవేశిస్తున్నారని అంటున్నారు