శంకర్ సినిమా లో యువ ముఖ్యమంత్రిగా రామ్ చరణ్ ........?

 


కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు యువ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించి మెప్పించిన సంగతి తెలిసిందే. భరత్ అనే నేను సినిమా సక్సెస్ కావడంతో పాటు నటుడిగా మహేష్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో మహేష్ బాబు తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రులు నిజంగా అమలు చేస్తే అభివృద్ధి జరుగుతుందని ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే మహేష్ బాబు దారిలోనే రామ్ చరణ్ కూడా పయనిస్తున్నారని తెలుస్తోంది. తన తరువాత సినిమాలో రామ్ చరణ్ యువ ముఖ్యమంత్రి పాత్రను పోషించనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు నిన్నటి నుంచి ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని శంకర్ తనకు అచ్చొచ్చిన ఫార్ములా కథతోనే ఈ సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. రామ్ చరణ్ సీఎంగా కనిపిస్తే మాత్రం ఆ పాత్ర చరణ్ కు మరింత మంచి పేరు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా రామ్ చరణ్ పాత్రకు సంబంధించి అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తైన తర్వాత చరణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. చరణ్ కెరీర్ లో ప్రయోగాత్మక సినిమాలతో పోలిస్తే కమర్షియల్ సినిమాల్లోనే ఎక్కువగా నటించారు. సీఎం పాత్రలో నటించి మెప్పించడం సాధారణమైన విషయం కాదు. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం రోజుకో పేరు తెరపైకి వస్తోంది. బడ్జెట్ సమస్యల వల్ల భారతీయుడు 2 సినిమా ఆగిపోవడంతో శంకర్ రామ్ చరణ్ సినిమాపైనే ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.