చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి పేర్ని నాని.

 


టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆ రాష్ట్ర మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు కుల పిచ్చి పట్టుకుందని దుయ్యబట్టారు. ఆ ట్రాన్స్ నుంచి చంద్రబాబు బయటకు రావాలని హితవు చెప్పారు. బాబు తన నైజం మార్చుకోకపోతే ప్రజలే బడిత పూజ చేస్తారని వ్యాఖ్యానించారు. ఆదివారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి పేర్ని నాని.. చంద్రబాబు టార్గెట్‌గా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు లాగా జగన్‌కు కుల పిచ్చి లేదన్నారు. చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన నేతలకే విజయవాడ, గుంటూరు మేయర్ అభ్యర్థులుగా అవకాశం ఇచ్చారని మంత్రి విమర్శించారు. మేయర్ చేయగల సమర్థత టీడీపీ జెండా మోసిన కార్యకర్తకి లేదా? అని చంద్రబాబును మంత్రి ప్రశ్నించారు. అసలు రాజకీయాల్లో డబ్బు జబ్బు అంటించిన వ్యక్తి చంద్రబాబు అని నిప్పులు చెరిగారు. రాజకీయ వ్యవస్థని భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. అప్పుడు చేసైనా సరే ఎన్నికల్లో నిలవండి అని తన పార్టీ నేతలకు చంద్రబాబు చెప్పడం చూస్తుంటే ఎంతకి దిగజారిపోయారో అర్థమవుతోందన్నారు. ‘అమరావతికే కాదు.. జగన్ పరిపాలనకు కూడా ఈ ఎన్నికలు రెఫరెండం’ అని మంత్రి పేర్ని నాని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు.