ఒక గంట పాటు వ్యాపారాలు, ప్రభుత్వాలు తమ అనవసరమైన లైట్లు, విద్యుత్ పరికరాలు స్విచ్ ఆఫ్.

 


వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ప్రారంభించిన ఎర్త్ అవర్ ఏటా మార్చి నెల చివరి శనివారం పాటిస్తున్నారు. ఈ సంవత్సరం ఈ కార్యక్రమం మార్చి 27 న జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు, వ్యాపారాలు, ప్రభుత్వాలు తమ అనవసరమైన లైట్లు, విద్యుత్ పరికరాలను (రాత్రి 8:30 గంటల నుంచి 9:30 గంటలు) ఒక గంట పాటు స్విచ్ ఆఫ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందరికీ స్థిరమైన భవిష్యత్తును అందించడానికి, ప్రకృతిని కాపాడాలనే అవగాహన పెంచడానికి ఈ ఎర్త్‌ అవర్ నిర్వహిస్తున్నారు. మనం రోజూ ఎన్నో గంటలు మన వృత్తి కోసం మన కుటుంబం కోసం వెచ్చిస్తాం. మనకు ప్రధాన జీవనాధారమైన భూమి గురించి సంవత్సరానికి ఒక గంట ఇవ్వలేమా? ఇదే ఆలోచనతో ప్రపంచ వ్యాప్తంగా 27 మార్చి శనివారం నాడు ఎర్త్ అవర్ ను పాటిస్తున్నారు. భూమి మీద వాతావరణం మెరుగుపడేందుకు, సహజమైన పరిస్ధితులు నెలకొనేందుకు ప్రజల్లో జాగృతిని తెచ్చే ఆలోచనే ఈ ఎర్త్ అవర్. కాలుష్యం పెరిగిపోవడం, ఆడవులు అంతరించిపోవడం, పర్యావరణ సమతుల్యత నశించడం వంటి కారణాల వల్ల భూమండలం వేడెక్కిపోతోంది. కాలుష్యం వల్ల ఓజోన్ పొర పలుచబడిపోతోంది. ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ఈసారి ప్రజల్లో ఎర్త్ అవర్ పై అవగాహన బాగా పెరిగిందని నిర్వాహకులు అంటున్నారు. రాజకీయ నాయకులు కలిసి రాకపోయినా ప్రజలు, సంస్ధలు స్వచ్చందంగా ఇందులో పాల్గొంటాయి. ఈ సంవత్సరం ప్రకృతికి కాపాడటానికి సరైన నిర్ణయాలు తీసుకొని తోడ్పడుదాం. ఐక్యరాజ్యసమితి జీవవైవిధ్య సమావేశాలు చైనాలో కొన్ని నెలల వ్యవధిలో జరగనున్నాయి. ప్రపంచ నాయకులు, ఈ సమావేశాలలో పాల్గొని పర్యావరణాన్ని కాపాడటానికి 10 సంవత్సరాల ప్రణాళికలను తయారు చేస్తారు.