నాగార్జున సాగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నోముల నర్సింహయ్య తనయుడు భగత్‌ పేరు ఖరారు .

 


తెలంగాణలో నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అయితే వివిధ పార్టీలు తమతమ అభ్యర్థులను ప్రకటించే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.ఇప్పటికే కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు దాదాపు ఖరారు చేసింది. నాగార్జున సాగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నోముల నర్సింహయ్య తనయుడు భగత్‌ పేరు ఖరారు అయింది. అయితే మధ్యాహ్నం తర్వాత టీఆర్‌ఎస్‌ అధిష్టానం అధికారికంగా ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. కాగా, నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గత ఏడాది డిసెంబర్‌లో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఇప్పుడు ఆయన కుమారుడికే టికెట్‌ ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు సాగర్‌ ఉప ఎన్నిక కోసం తొలి ఐదు నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఐదుగురు స్వతంత్ర (ఇండిపెండెంట్‌) అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. సాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలుకు ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఉంది. కాగా, ఈ నెల 31న నామినేషన్ల పరిశీలి, ఏప్రిల్‌ 1వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. ఇక ఏప్రిల్‌ 17వ తేదీన ఉప ఎన్నికకు పోలింగ్‌ జరగనుంది. మే 2వ తేదీన ఫలితం వెలువడనుంది. అయితే కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థిగా కందూరు జానారెడ్డిని ప్రకటించింది. సిట్టింగ్‌ స్థానం కావడంతో అభ్యర్థి ఎంపికపై టీఆర్‌ఎస్‌ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇక బీజేపీ సైతం తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. కాగా, గత దుబ్బాక ఉప ఎన్నికలో ఎదురైన పరిణామాలు పునరావతృతం కాకుండా టీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పటికే నుంచి వ్యూహాలు రచిస్తోంది. అభ్యర్థిని గెలిపించుకునేందుకు పకడ్బందీగా చర్యలు చేపడుతోంది. ఇదిలా ఉంటే.. మరో వైపు బీజేపీ కూడా దుబ్బాక ఎన్నికల ఫలితాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతోంది. అక్కడ బీజేపీ విజయం సాధించినట్లే నాగార్జున సాగర్‌లో కూడా తమ అభ్యర్థి తప్పకుండా గెలిపించుకుంటామని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.