తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో విషాదం.

 




తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో స్నానం చేసేందుకు దిగిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడి చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. ఏపీలోని తూర్పు గోదావరికి జిల్లాకు చెందిన ఓ కుటుంబం రెండు రోజుల క్రితం భద్రాచలం అయ్యప్ప కాలనీలోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం ఐదుగురు స్నానం చేసేందుకు గోదావరిలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో ఐదుగురు కూడా నీటిలో గల్లంతయ్యారు. నీటిలో వారు మునిగిపోతుండటాన్ని గమనించిన స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలను రక్షించి భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు నీటిలో మునిగి మరణించారు. మరణించిన వారిలో ఇద్దరు మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. మృతులు చరణ్‌, వరలక్ష్మి, సురేఖగా గుర్తించారు. భద్రాచలంలోని అయ్యప్ప కాలనీకి చెందిన కుటుంబం బతుకు తెరువు కోసం తూర్పుగోదావరి జిల్లా మండపేట వెళ్లిపోయారు. అయితే భద్రాచలం అయ్యప్ప కాలనీలో ఉంటున్న బంధువుల ఇంటికి శుభకార్యానికి వచ్చారు. ఈ క్రమంలో ఈ విషాద సంఘటన చోటుచేసుకున్నట్లు బంధువులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని వివరాలు సేకరించారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందటంతో అయ్యప్పకాలనీలో విషాధచాయలు అలుముకున్నాయి..