ఎమ్మెల్సీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.

 


వరంగల్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి ఎన్‌రోల్‌మెంట్‌కు తగ్గట్టుగా ఓటింగ్‌శాతం పెరిగిందని పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తెలిపారు. పట్ట భ ద్రులు ఓటు హక్కును వినియోగించుకుని ఓటు వేయడం లేదనే అపప్రదను చెరిపేశారని అన్నారు. పోలింగ్‌ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పట్ట భద్రులు చారిత్రాత్మకంగా ఓట్లువేసి ప్రజా స్వామ్య స్పూర్తిని నింపారని చెప్పారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడి పోలింగ్‌ ను సక్సెస్‌చేసిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈసారి ఎన్నికల్లో రికార్డుస్థాయిలో ఓటింగ్‌ జరిగిందని మంత్రి తెలిపారు. టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధిస్తుందన్న ధీమా వ్యక్త చేశారు. ఉద్యోగులకు, టీచర్‌లకు ఓటు వేసిన ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు. ఇప్పటికే 72శాతం పోలింగ్‌ జరిగిందని, ఇంకా చాలా పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు వేసేందుకు వేచి ఉన్నారని చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రెండు చోట్లా అధికంగానే ఓటింగ్‌శాతం నమోదైందని మంత్రి వెల్లడించారు. ఒకటి రెండు చోట్ల చిన్నచిన్న సంఘటనలు తప్ప పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు. టీఆర్‌ ఎస్‌ పార్టీ వారు ఎక్కడా గొడవలు చేయలేదని, కొన్నిచోట్ల బీజేపీ వాళ్లు గొడవ చేసే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఎంతో సహనంతో ఉన్నారని అన్నారు.