జనరిక్ ఆధార్ యాప్ ను ప్రారంభించిన రతన్ టాటా.

 


ఔషధ స్టార్టప్ కంపెనీ జనరిక్ ఆధార్ యాప్‌ను సోమవారం రతన్ టాటా విడుదల చేశారు. ఈ యాప్‌లో మెడికల్ ప్రిస్క్రిప్షన్‌లను అప్‌లోడ్ చేసేందుకు, ఆర్డర్లను ఇచ్చే సదుపాయాలు ఉన్నాయి. ఆన్‌లైన్ ఫార్మసీలో పోటీని అధిగమించేందుకు దీన్ని ప్రారంభించారు. సంబంధిత మందులు సమీప జనరిక్ ఆధార్ ఫ్రాంచైజీ స్టోర్ నుంచి పంపిణీ చేయనున్నారు. ‘ప్రజలు చేరువ కావడానికి జనరిక్ ఆధార్ ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే, దేశీయంగా ప్రజల ఆరోగ్య సంరక్షణ సామర్థ్యాన్ని పెంపోందించేందుకు ఇది తోడ్పాటునందిస్తుంది. ప్రజలకు సేవ చేయాలనే తమ కోరికకు మరింత బాధ్యత సంతరించుకుంది. ప్రజలకు సరసమైన ధరలకే నాణ్యమైన మందులను అందించనున్నామని’ రతన్ టాటా అన్నారు. ‘జనరిక్ ఆధార్’ మొబైల్ యాప్ దేశీయంగా స్వతంత్ర రిటైల్ దుకాణాలు ఆన్‌లైన్ ఫార్మసీల నుంచి పోటీని ఎదుర్కొనేందుకు సహాయపడనుంది. వినియోగదారులు సమీప ప్రాంతాల నుంచి తక్కువ సమయంలో మందులను డెలివరీ పొందవచ్చని జనరిక్ ఆధార్ వ్యవస్థాపకుడు 18 ఏళ్ల అర్జున్ దేశ్‌పాండే చెప్పారు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో రతన్ టాటా రూ.1500 కోట్ల విరాళాలు ప్రకటించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కష్ట పరిస్థితుల్లో ఆయన స్పందనపై అప్పట్లో చాలామంది ప్రశంసించారు. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా కూడా కరోనా వ్యాక్సిన్‌‌ను తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి, వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. టీకా తీసుకుంటే అసలు నొప్పే లేదని రతన్ టాటా పేర్కొన్నారు. అందరూ త్వరలోనే వ్యాక్సిన్‌ వేసుకుని రోగ నిరోధక శక్తిని పెంచుకుంటారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నానంటూ ఆయన ట్వీట్ చేశారు.