పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి ప్రధాని మోదీ గ్రీటింగ్స్.

 


పాకిస్తాన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆ దేశ ప్ర ధాని ఇమ్రాన్ ఖాన్ కి గ్రీటింగ్స్ పంపారు. ఉభయ దేశాల మధ్య సుహృద్భావ సంబంధాలు నెలకొనాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదం, వైషమ్యాలకు ఆస్కారం లేకుండా రెండు దేశాల ప్రజలూ శాంతియుతంగా జీవించాలని, పరస్పర సౌహార్ద భావనలతో ఒకరినొకరు గౌరవించుకోవాలని ఆయన ఇమ్రాన్ ఖాన్ కి రాసిన లేఖలో పేర్కొన్నారు. పొరుగు దేశంగా మీతో స్నేహ సంబంధాలను కోరుకుంటున్నామని ఆయన అన్నారు. ఇలాంటి వాతావరణం ఏర్పడుతుందని తాను ఆశిస్తున్నానన్నారు. కరోనా వైరస్ పాండమిక్ వల్ల తలెత్తిన సవాళ్ళను పాక్ కూడా సమర్థంగా ఎదుర్కోగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాగారెండు దేశాల మధ్య సంబంధాలు కొంత పురోగమిస్తున్నట్టు కనిపిస్తోంది. శాశ్వత ఇండస్ కమిషన్ ఏర్పాటు కోసం జరిగే సమావేశాలలో పాల్గొనేందుకు పాకిస్థాన్ నుంచి ఉన్నత స్థాయి బృందమొకటి ఈ నెల 22 న ఢిల్లీని విజిట్ చేసింది. రెండున్నర సంవత్సరాల తరువాత ఈ విధమైన సమావేశం జరగడం ఇదే మొదటిసారి. పైగా 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందానికి అనుగుణంగా నడుచుకోవాలని గత నెలలో రెండు దేశాల మిలిటరీ అధికారులు నిర్ణయించారు. హాట్ లైన్ ద్వారా ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగించాలని తీర్మానించారు. ఇక విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్.. ఇండియా ఎప్పుడూ తన పొరుగు దేశాలతో శాంతిని, సామరస్యాన్ని కోర్చుతుందని, పాక్ కూడా ఇలాగే స్పందిస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఇలా ఉండగా జమ్మూ కాశ్మీర్ కి మళ్ళీ రాష్ట్ర ప్రతిపత్తి కల్పించే విషయాన్ని పరిశీలిస్తున్నామంటూ హోం మంత్రి అమిత్ షా ఇటీవల చేసిన ప్రకటనపై కూడా పాకిస్థాన్ మెత్తబడినట్టు కనిపిస్తోంది. ఈ కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతానికి 370 అధికరణాన్ని ప్రభుత్వం రద్దు చేసినప్పటి నుంచి పాక్ ఇండియా పట్ల ఆగ్రహంతో ఉంది. ఇది కాశ్మీరీల స్వయంనిర్ణయాధికారాన్ని హరించడమేనని పేర్కొంది.