ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఆలియా భట్ లుక్ అదరహో.

 


సోషల్ మీడియా విస్తృతి పెరగడం, అందరికీ ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావడంతో చాలా మంది తమ అభిప్రాయాలను, ఆలోచనలను ప్రపంచంలో పంచుకోవడం చాలా సులభంగా మారింది. ఇక మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. సామాన్యులు సైతం సినిమాల్లోని లోటు పాట్లను గుర్తిస్తూ నెట్టింట్లో పెట్టేస్తున్నారు. దీంతో మూవీ మేకర్స్‌ ఏ తప్పు చేసినా వెంటనే దొరికిపోతున్నారు. ఇటీవల రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా తెరకెక్కుతోన్న ఆర్‌.ఆర్‌.ఆర్‌ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రను పరియం చేస్తూ విడుదల చేసిన టీజర్‌లోని కొన్ని షార్ట్‌లు ఇతర సినిమాలకు చెందినవి అంటూ కొందరు నెటిజన్లు పోస్ట్‌లు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్‌.ఆర్‌.ఆర్‌కు సంబంధించిన మరో అంశంపై నెటిజన్లు స్పందిస్తున్నారు. అయితే ఈసారి సినిమాలో ఉన్న తప్పు గురించి కాకుండా.. ఒక చిన్న లాజిక్‌ను పట్టుకునే ప్రయత్నం చేశారు. తాజాగా బాలీవుడ్‌ నటి అలియా భట్‌ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్‌ ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమాలో తన పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అలియా ఈ సినిమాలో సీత పాత్రలో నటిస్తుండగా.. ఓ కోవెల ముందు కూర్చున్న ఫొటోను మూవీ మేకర్స్‌ పంచుకున్నారు. ఇదిలా ఉంటే ఈ ఫొటోలో అలియా మెడలో ఒక పులిగోరు ఉండడాన్ని మీరు గమనించే ఉంటారు. అయితే ఇదే పులిగోరును సినిమా క్లైమాక్స్‌లో అల్లూరి పాత్రలో ఉండే రామ్‌చరణ్‌ చేతికి కనిపిస్తుంది. కొన్ని రోజుల క్రితం చిత్ర యూనిట్‌ విడుదల చేసిన బిగ్గెస్ట్‌ క్లైమాక్స్‌ షూట్‌కి సంబంధించిన ఫొటోలో ఈ విషయాన్ని గమనించవచ్చు. ఇప్పుడు ఇదే విషయాన్ని గుర్తించిన కొందరు నెటిజన్లు సోషల్‌ మీడియాలో కథలు అల్లేస్తున్నారు. ఇంతకీ అలియా మెడలో ఉన్న పులిగోరు రామరాజు చేతికి ఎందుకు వచ్చింది. ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధం ఏంటన్నదానిపై చర్చ మొదలైంది. మరి జక్కన స్ట్రాటజీ మాములుగా ఉండదు కదా..! ఇందులో కూడా ఏదో ఒక అంతరార్థం ఉండే ఉంటుంది. అది తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాలి