రాజకీయ పార్టీలకు వెల్లువెత్తుతున్న విరాళాలు.

 


దేశంలో సంపన్నుల ఆస్తుల జాబితా పెరిగిపోతున్నట్లే రాజకీయ పార్టీలకు అందే విరాళాలు పెరిగిపోతున్నాయి. దాంతో రాజకీయ పార్టీలు ధనిక పార్టీలుగా మారిపోతున్నాయి. కార్పొరేట్ హౌజెస్ నుంచి రాజకీయ పార్టీలకు వెల్లువెత్తుతున్న చందాలతో దేశంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు సంపన్న పక్షాలుగా మారిపోతున్నాయి. ఇటీవల కాలంలో ఈ ట్రెండ్ పెరిగిపోతోంది. దాంతో గతంతో పోల్చుకుంటే ఇటీవల కాలంలో రాజకీయ పార్టీల ఆస్తులు గణనీయంగా పెరిగిపోయాయి. గత ఆరేళ్లలో దేశంలో రాజకీయ పార్టీల ఆస్తులు రెట్టింపయ్యాయంటే రాజకీయ పార్టీలకు కార్పొరేట్ హౌజెస్ నుంచి ఏ స్థాయిలో విరాళాలు వెల్లువెత్తుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. గత పదిహేనేళ్ళలో దేశంలో జాతీయ పార్టీలన్నీ కలిపి అక్షరాలా 11 వేల 234 కోట్ల రూపాయలను విరాళాలుగా పొందాయి. 2004-05 నుంచి 2018-19 మధ్య కాలంలో రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల వివరాలను అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ బయటపెట్టింది. ఆదాయపన్ను శాఖకు వివిధ పార్టీలు సమర్పించిన రిటర్నుల ఆధారంగా ఏడీఆర్‌ నివేదిక ఇచ్చింది. గత 6 ఏళ్లలో అధికంగా విరాళాలు పొందిన రాజకీయ పార్టీగా నిలిచిన బీజేపీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. గత ఆరు సంవత్సరాలలో బీజేపీ ఆస్తుల విలువ నాలుగు రెట్లు పెరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నంత కాలం ఆ పార్టీకి విరాళాలు ఇస్తూ వచ్చిన కర్పొరేట్ హౌజెస్ ఇపుడు బీజేపీకి ఫండింగ్ చేస్తున్నాయి. అయితే గత ఏడేళ్ళుగా అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి విరాళాలు పెద్దగా ఏమీ తగ్గలేదు. ఇప్పటికీ బీజేపీ తర్వాత రెండో స్థాయంలో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతోంది. ఈ జాబితాలో చివరి స్థానంలో వున్న జాతీయ పార్టీగా సీపీఐ నిలిచింది. ఇక ప్రాంతీయ పార్టీలలో సంపన్న పార్టీల జాబితాలో సమాజ్‌వాదీ పార్టీ కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ సంపన్న పార్టీగా నిలిచింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నిలిచింది. ఏపీలో అధికార పార్టీ వైసీపీ కూడా సంపన్న పార్టీల జాబితాలో రీసెంట్‌గా చేరింది. తాజా గణాంకాల ప్రకారం… 2017-18లో దేశంలోని మొత్తం అన్ని పార్టీల ఆస్తుల విలువ కలిపితే.. రూ. 4,776.71 కోట్లుగా లెక్క తేలింది. ఇందులో జాతీయ పార్టీలవి రూ. 3,456.65 కోట్లు కాగా.. ప్రాంతీయ పార్టీలవి రూ. 1,320.06 కోట్లుగా లెక్క తేలింది. 2018-19లో దేశంలోని మొత్తం అన్ని పార్టీల ఆస్తుల విలువ రూ. 7,372.96 కోట్లు కాగా.. ఇందులో జాతీయ పార్టీలవి రూ. 5,349.25 కోట్లు, ప్రాంతీయ పార్టీలవి రూ. 2,023.71 కోట్లుగా లెక్క తేల్చారు.